ఖోఖోలో ప్రపంచ విజేతగా భారత్.. విజయంలో తెలుగోడి పాత్ర..

ఖోఖోలో భారత్ ప్రపంచ విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగుతుందనుకున్న పోరులో సునాయాసంగా భారత్ గెలిచింది.

Update: 2025-01-20 07:31 GMT

ఖోఖోలో భారత్ ప్రపంచ విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగుతుందనుకున్న పోరులో సునాయాసంగా భారత్ గెలిచింది. ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 78-40తో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచి వరుసగా పాయింట్లు సాధించిన మహిళల జట్టు.. ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ముఖ్యంగా కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే అత్యుత్తమ ఆటతీరు కనబర్చారు. సారథిగా జట్టును ముందుండి నడిపించారు. వైష్ణవి పవార్, సంజన, ప్రియాంక, చైత్ర భారత్ తరపున పాయింట్లు సాధించి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

ఇక పురుషుల జట్టు కూడా ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా నేపాల్ తో జరిగిన ఫైనల్ పోరులో పురుషుల జట్టు విజయఢంకా మోగించింది. 54-36 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. తొలి రౌండ్‌లో 26-18 ఆధిక్యంలో నిలిచిన భారత్ అదే జోరును చివరి వరకు కొనసాగించింది. మూడో రౌండ్ లో భారత పురుషులు మరింత దూకుడుతో ఇంకో 28 పాయింట్లు సొంతం చేసుకున్నారు. ఇక చివరి టర్న్‌లో నేపాల్ 18 పాయింట్లే చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. అయితే ఇక్కడ మహిళలు, పురుషుల ప్రత్యర్థి జట్లు నేపాల్‌వే కావడం గమనార్హం.

అయితే భారత మహిళల జట్టు ఖోఖో వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవడంలో తెలుగోడి పాత్ర ఉండడం విశేషం. అతడే ఇస్లావత్ నరేష్. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని బంజరపల్లికి చెందిన నరేష్.. భారత మహిళల జట్టుకు సహాయ కోచ్‌గా ఉన్నారు. 1995లో క్రీడాకారుడిగా కెరీర్ మొదలుపెట్టిన నరేష్.. 2015లో కోచ్‌గా మారారు. ఆ తర్వాత జాతీయ జట్టుకు సహాయ కోచ్‌గా ఎదిగారు. ఆటగాళ్ల తప్పులు, బలహీనతలను సరిచేయడంలో స్కిల్ అనలైజర్‌గా ముఖ్య పాత్ర పోషించారు.

ఖోఖో విశ్వవిజేతలుగా నిలిచిన భారత మహిళ, పురుషుల జట్లను ఆకాశానికి ఎత్తేస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చారిత్రాత్మక విజయంతో భారత్‌లో ఖోఖోకు ప్రాధాన్యం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దేశంలోని పురాతన సంప్రదాయ క్రీడల్లో ఒకటైన ఖోఖోను మరింత వెలుగులోకి తీసుకొస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు క్రీడా ప్రేమికులు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు ఖోఖో జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

జట్లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సినీ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత్ కు చెందిన ప్రాచీన క్రీడ ఖోఖో. తొలిసారి ప్రపంచ కప్ జరిగింది. ఈ గొప్ప సంబరాలను క్రీడా ప్రపంచం నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. అత్యద్భుతమైన ప్రదర్శనలతో తొలి టైటిల్స్ గెలిచి దేశం గర్వించేలా చేసినందుకు భారత మహిళ, పురుషుల జట్లకు దర్శకుడు రాజమౌళి అభినందనలు తెలియజేశారు. తొలి ఖోఖో వరల్డ్ కప్ గెలవడమే కాకుండా.. భారతదేశపు పురాతన క్రీడల్లో ఒకటైన ఈ ఆటకు పునరుజ్జీవాన్ని పోశారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందన్నారు హీరో మహేష్ బాబు.

Tags:    

Similar News