India vs Australia: ఉప్పల్ టీ20లో భారత్ విజయం

India vs Australia: ఆస్ట్రేలియాపై 6వికెట్ల తేడాతో గెలుపు.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఘన విజయం

Update: 2022-09-26 00:57 GMT

India vs Australia: ఉప్పల్ టీ20లో భారత్ విజయం

India vs Australia: ఉప్పల్ టీ20 మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపొందింది. 2-1 తేడాతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ కామెరూన్ గ్రీన్ , టిమ్ డేవిడ్ ధాటిగా ఆడటంతో ఆసీస్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 186 స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, భువనేశ్వర్ కుమార్, చాహల్, హర్షల్ తలో వికెట్ తీశారు.

లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొన్ని మంచి షాట్లు ఆడిన రోహిత్ శర్మ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ క్రమంలో జతకలిసిన సూర్యకుమార్ యాదవ్ 69 పరుగులు, కోహ్లీ 63 పరుగులతో జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. సూర్యకుమార్ అవుటైన తర్వాత ఆసీస్ బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా చేయడంతో కొంత టెన్షన్ నెలకొంది.

చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి కోహ్లీ భారీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి బంతికే అతను అవుటయ్యాడు. ఆ ఓవర్ ఐదో బంతి.. పాండ్యా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వెళ్లడంతో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ బౌలర్లలో డానియల్ శామ్స్ 2 వికెట్లు తీసుకోగా.. జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. గవర్నర్ తమిళిసైతో పాటు పలువురు ప్రముఖులు మ్యాచ్‌ను తిలకించి ఎంజాయ్ చేశారు.

హైదరాబాద్ లో జరిగిన మూడవ T-20 మ్యాచ్ లో ఆస్టేలియాపై ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా క్రికెట్ టీమ్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆట లో క్రీడాస్పూర్తి ని ప్రదర్శిస్తూ క్రికెట్ అభిమానులకు ఉత్సాహాన్ని నింపిన ఇరు జట్ల క్రీడాకారులను సీఎం అభినందించారు.

Tags:    

Similar News