India vs England: భారత్ పుంజుకుంటుందా? ఎడ్జ్‌బస్టన్ వేదికగా నేటి నుంచే రెండో టెస్టు
India vs England: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేటి నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది.
India vs England: భారత్ పుంజుకుంటుందా? ఎడ్జ్‌బస్టన్ వేదికగా నేటి నుంచే రెండో టెస్టు
India vs England: ఇంగ్లాండ్ పర్యటనలో తొలి టెస్టులో ఓటమిని ఎదుర్కొన్న టీమిండియా, ఇప్పుడు రెండో టెస్టులో పుంజుకోవాలని భావిస్తోంది. నేటి నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బస్టన్ స్టేడియంలో రెండో టెస్టు ఆరంభంకానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.
ఎడ్జ్‌బస్టన్‌లో భారత్‌కు చేదు జ్ఞాపకాలు:
ఈ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్‌ను కూడా గెలవలేదు. 8 టెస్టుల్లో 7 ఓటములు, ఒక డ్రా నమోదయ్యాయి. 2022లో ఇక్కడే జరిగిన చివరి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల ఆధిక్యంలో ఉన్నప్పటికీ 7 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
భారీ మార్పులు అనివార్యమా?
తొలి టెస్టులో జట్టు వ్యూహాలు విఫలమైన నేపథ్యంలో, రెండో టెస్టుకు భారత తుది జట్టులో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుమ్రా తుది జట్టులో ఉంటాడా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. అతడికి విశ్రాంతి ఇస్తే ఆకాశ్ దీప్ లేదా అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
స్పిన్నర్ల విభాగంలో జడేజా సరసన వాషింగ్టన్ సుందర్ లేదా కుల్దీప్ యాదవ్ జట్టులోకి రావొచ్చు. సుందర్‌కి బ్యాటింగ్ సామర్థ్యం ఉండటంతో అతడికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయం. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది.
బ్యాటింగ్‌లో మెరుగుదల అవసరం:
జైశ్వాల్, గిల్, పంత్, రాహుల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ విఫలమవడం భారత్ పరాజయానికి కారణమైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో 471, 464 పరుగులు చేసినా… ముఖ్య సమయంలో 7, 6 వికెట్లు తక్కువ పరుగుల వ్యవధిలో కోల్పోవడం దెబ్బ కొట్టింది.
ఫీల్డింగ్, బౌలింగ్ లోపాలు కూడా బాధ్యతాయుతమే:
తొలి టెస్టులో భారత్ మొత్తం 7–8 క్యాచ్‌లు వదిలేసింది. అవన్నీ ఇంగ్లండ్ కీలక బ్యాటర్లవే. అదే సమయంలో బౌలర్లు 371 పరుగుల లక్ష్యాన్ని కాపాడలేకపోయారు. ఒక్క దశలో వరుసగా నాలుగు వికెట్లు తీసినా ఆ ఉత్సాహాన్ని నిలబెట్టలేకపోయారు.
ఇంగ్లాండ్‌లో ఉత్సాహం:
ఇంగ్లాండ్ తొలి టెస్టులో విజయం సాధించిన నేపథ్యంలో, రెండో టెస్టుకు గెలుపు జోష్‌తో బరిలోకి దిగుతోంది. సిరీస్‌ను 2-0కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ టెస్టులో టీమిండియాకు గెలిచే అవసరమే కాకుండా, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే అవకాశం కూడా. ఎడ్జ్‌బస్టన్‌లో చరిత్రను తిరగరాయాలంటే ప్రతి విభాగంలో సమష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.