WTC 2025-27: వెస్టిండీస్‌పై మొదటి రోజునే భారత్ పట్టు.. రాహుల్ హాఫ్ సెంచరీ, సిరాజ్-బుమ్రా దెబ్బ

WTC 2025-27: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైన మొదటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా మొదటి రోజు ఆటలోనే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

Update: 2025-10-03 03:30 GMT

WTC 2025-27: వెస్టిండీస్‌పై మొదటి రోజునే భారత్ పట్టు.. రాహుల్ హాఫ్ సెంచరీ, సిరాజ్-బుమ్రా దెబ్బ

WTC 2025-27: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైన మొదటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా మొదటి రోజు ఆటలోనే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్ 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్లో భారతదేశానికి రెండో సిరీస్. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు భారత పేసర్లు, స్పిన్నర్ల ధాటికి కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసి, మ్యాచ్‌పై పట్టు బిగించింది. భారత్‌కు ఆధిక్యం కోసం ఇంకా 41 పరుగులు మాత్రమే అవసరం.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టుకు ఏదీ కలిసి రాలేదు. భారత పేస్ బౌలర్లు మహ్మద్ సిరాజ, జస్‌ప్రీత్ బుమ్రా తొలి గంటలోనే విండీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. కేవలం 42 పరుగులకే నాలుగు ముఖ్యమైన వికెట్లు కోల్పోయి విండీస్ తడబడింది. సిరాజ్ ఓపెనర్ తేజ్‌నారాయణ్ చంద్రపాల్ (0), బ్రాండన్ కింగ్ (12), అలిక్ అథనాజే (13)లను అవుట్ చేయగా, బుమ్రా జాన్ క్యాంప్‌బెల్ (8) వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ రోస్టన్ చేజ్, షై హోప్ ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించి కొంత నిలకడ చూపారు.

ఆ తర్వాత, కులదీప్ యాదవ్ హోప్‌ను, సిరాజ్ కెప్టెన్ చేజ్‌ను బౌల్డ్ చేశాడు. చివర్లో సుందర్ ఖారి పియరె (11)ను ఎల్‌బీడబ్ల్యూ చేయగా, బుమ్రా రెండు షార్ప్ యార్కర్లతో జస్టిన్ గ్రీవ్స్ (32), జోహాన్ లియాన్ (1)లను క్లీన్ బౌల్డ్ చేసి విండీస్ ఇన్నింగ్స్‌కు తెరదించారు. వెస్టిండీస్ జట్టు కేవలం 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. తొలి రోజు చివరి సెషన్‌లో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా, బ్యాటింగ్‌లో కూడా పటిష్టంగా కనిపించింది.

ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. జైస్వాల్ 54 బంతుల్లో 7 బౌండరీలతో 36 పరుగులు చేసి అవుటయ్యాడు. సాయి సుదర్శన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి త్వరగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతంగా ఆడి, మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. వీరిద్దరూ అజేయంగా 31 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ 114 బంతుల్లో 6 బౌండరీలతో అజేయంగా 53 పరుగులు చేశాడు, ఇది అతని హాఫ్ సెంచరీ. శుభ్‌మన్ గిల్ 42 బంతుల్లో 18 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ ఇప్పుడు విండీస్ స్కోరును సమం చేయడానికి కేవలం 41 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. రెండో రోజు బౌలర్లకు సహకరించని పిచ్‌పై భారత్ భారీ ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tags:    

Similar News