IND vs PAK: ఒక్కదెబ్బకు రెండు పిట్టలు..భారత్ కు ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్త్ ఖాయం?
IND vs PAK: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదేనేమో. ఓ గెలుపు భారత్ కు ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసేసింది. అంతే కాదు పాకిస్తాన్ ను ఇంటిముఖం పట్టించింది. ఆదివారం పాకిస్తాన్ ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీకి..శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్, సమయోచిత ఇన్సింగ్స్ తోడవడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలోనే ఛేదించింది. మొదట పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.సౌద్ షకీల్ టాప్ స్కోరర్. కుల్ దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య ప్రత్యర్థిని దెబ్బ తీశారు. భారత్ మార్చి 2న తన చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.
భారత్ ఇన్నింగ్స్ లో మరీ ఎక్కువ మెరుపుల్లేవన్న మాటే కానీ..ఛేదనలో ఎక్కడా పెద్దగా ఇబ్బంది పడలేదు. ఇన్నింగ్స్ ఆద్యంతం భారత్ దే పైచేయి. కెప్టెన్ రోహిత్ ఎక్కువసేపు నిలవలేదు కానీ..చిన్న ఇన్నింగ్స్ తోనే పాక్ కొత్త బంతి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. చకచకా నాలుగు షాట్లు ఆడి ఇన్నింగ్స్ దూకుడైన ఆరంభాన్నిచాడు రోహిత్. అయితో ఓవర్లో షహీన్ యార్కర్ కు బౌల్డయి వెనుదిరిగాడు. తర్వాత ఇంకో వికెట్ కోసం గంటపాటు ఎదురుచూడాల్సి వచ్చింది.
రోహిత్ ఔట్ అయిన తర్వాత షాట్లు కొట్టే బాధ్యత శుభ్ మన్ తీసుకున్నాడు. అదిరే ఫామ్ లో ఉన్న అతను చూడముచ్చటైన డ్రైవలతో స్కోర్ ను పరుగులు పెట్టించాడు. షహీన్ బౌలింగ్ లో అతను కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ఆరంభించిన కోహ్లి కూడా నిలదొక్కుకున్నాక చక్కటి షాట్లు తీశాడు. కానీ అతను ఏ దశలోనూ అవసరానికి మించిన దూకుడును కనబర్చలేదు. 100/1తో భారత్ పటిస్ట స్థితికి చేరుకున్న దశలో స్పిన్నర్ అబ్రార్ టర్నింగ్ డెలివరీ శుభమన్ స్టంప్స్ ను లేపేసింది.