Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రా హాఫ్ సెంచరీ... తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు!
Ind vs Aus 2nd test match: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్స్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసి.. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 50 వికెట్ తీసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది 11 టెస్టుల్లో బుమ్రా ఈ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్స్ పడగొట్టిన మూడో భారత పేసర్‌గా నిలిచాడు.
జస్‌ప్రీత్ బుమ్రా కంటే ముందు ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన జాబితాలో మాజీ పేసర్లు కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ఉన్నారు. 1979లో కపిల్ దేవ్ 17 మ్యాచ్‌ల్లో 74 వికెట్లు పడగొట్టగా.. 1983లో 18 టెస్టుల్లో 75 వికెట్లు పడగొట్టాడు. జహీర్ ఖాన్ 2002లో 15 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు తీశాడు. బిఎస్ చంద్రశేఖర్, హిమ్మత్‌లాల్ మన్కడ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ సైతం ఒకే ఏడాదిలో 50 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. అయితే వీరందరూ స్పిన్నర్లు కావడం విశేషం.
అడిలైడ్ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 86 రన్స్ చేసింది. మార్నస్ లబుషేన్ (20), నాథన్ మెక్‌స్వినీ (38) క్రీజులో ఉన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీశాడు. అంతకుముందు భారత్ 180 పరుగులకు కుప్పకూలింది.తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్. 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్స్ తీశాడు. స్టార్క్ దెబ్బకు టీమిండియా విలవిల్లాడింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఇంకా 94 రన్స్ వెనుకంజలో ఉంది. రెండో రోజు ఆరంభంలో భారత బౌలర్లు వికెట్లు పడగొట్టి.. ఆస్ట్రేలియా జట్టును ఒత్తిడిలోకి నెట్టాలి. లేదంటే టీమిండియాకు తిప్పలు తప్పవు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన జస్‌ప్రీత్ బుమ్రా పర్‌ఫార్మెన్స్ గురించి ఈ వీడియో చూడండి.