దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభానికి గంటల ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ

IND VS South Africa: *కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ గాయంతో ఉన్నపళంగా సిరీస్‌ మొత్తానికి దూరం

Update: 2022-06-09 01:26 GMT

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభానికి గంటల ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ

IND VS South Africa: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభానికి గంటల ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లేని ఈ సిరీస్‌కు సరైన నాయకుడిగా భావించి కేఎల్‌ రాహుల్‌కు పగ్గాలు అప్పగిస్తే అతను గాయంతో ఉన్నపళంగా సిరీస్‌ మొత్తానికి దూరం కావడం జట్టుకు షాక్‌ ఇచ్చింది. అతనితో పాటు స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్ కూడా గాయపడడంతో ప్రొటీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు స్టార్లు, సత్తాగల అనుభవజ్ఞులతో సఫారీ జట్టు సవాలు విసురుతోంది. కేఎల్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ కమ్‌ బ్యాటర్‌ రిషబ్ పంత్‌ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్‌ ఆటగాళ్లు లేకుండానే ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతోంది టీమ్‌ఇండియా. ఇప్పుడు గాయంతో కేఎల్ రాహుల్ తప్పుకోవడం భారతజట్టును ఇబ్బంది పెట్టే విషయమే. ఇక ఐపీఎల్‌-2022లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్ సేవల్ని కోల్పోతుండడం టీమిండియాకు పెద్ద మైనస్సేనని చెప్పుకోవచ్చు.

సీనియర్లు లేకుండానే దక్షిణాఫ్రికాతో ఐదు పొట్టి మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది టీంమిండియా. ఇవాళ ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి టి20 జరుగనుంది. అయితే భారత్‌ కుర్రాళ్లపైనే... ఆశలు పెట్టుకుంది. సీనియర్లంతా సిరీస్‌కు అనూహ్యంగా దూరమవడం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెట్టే అంశమైనా యువ ఆటగాళ్లకు మాత్రం ఇది లక్కీ చాన్స్‌! రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌లో సత్తా చాటుకునేందుకు ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది.

ఆల్‌రౌండర్లు దీపక్‌ హుడా, హర్షల్‌ పటేల్‌లతో పాటు అవేశ్‌ ఖాన్, రవి బిష్ణోయ్‌లకు తుది జట్టులో స్థానాలు దాదాపు ఖాయమయ్యాయి. దీంతో టీమిండియా పూర్తిగా యువరక్తంతోనే పటిష్టమైన దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. తాత్కాలిక కెప్టెన్‌ రిషభ్‌ పంత్, అనుభవజ్ఞుడైన హార్దిక్‌ పాండ్యా మార్గదర్శనం చేస్తే యువకులు మెరుపులు మెరిపిస్తారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆస్ట్రేలియాకు పయనమయ్యే ప్రపంచకప్‌ జట్టు రేసులో ఉంటారు.

Tags:    

Similar News