ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ కన్నుమూత

*రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆండ్రూ సైమండ్స్

Update: 2022-05-15 03:07 GMT

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ కన్నుమూత

Andrew Symonds: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతిచెందాడు. క్వీన్స్‌లాండ్‌లోని టౌన్‌విల్లేలో రాత్రి 10.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదంలో సైమండ్స్‌ ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాద స‌మ‌యంలో సైమండ్స్ ఒక్కరే కారులో ఉన్నట్లు సమాచారం. దిగ్గజ క్రికెటర్‌ మృతితో క్రికెట్‌ ఆస్ట్రేలియాతో పాటు క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

సైమండ్స్‌ మృతిపట్ల మాజీ సహచరుడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అతని మృతి తనను ఎంతగానో కలచివేసిందని చెప్పాడు. అతనితో ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ పీల్డ్‌లో మంచి అనుబంధం ఉందని తెలిపాడు. సైమండ్స్‌ మరణం పట్ల ఐసీసీ సంతాపం తెలిపింది. మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న సైమండ్స్‌ 1998లో పాకిస్థాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. 198 వన్డేల్లో ఆరు సెంచరీలు, 30 అర్ధ సెంచరీలతో మొత్తం 5వేల88 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 37.26 సగటుతో 133 వికెట్లు తీసి తన బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో జట్టు విజయాల్లో ప్రధానపాత్ర పోషించాడు.

ఇక 2004లో శ్రీలంకతో తన తొలి టెస్ట్‌ ఆడిన సైమండ్స్‌ మొత్తం 26 మ్యాచుల్లో 1463 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 14 టీ 20 మ్యాచులు ఆడి 337 పరుగులు చేయడంతోపాటు 8 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌తో సైమండ్స్‌కు మంచి అనుబంధం ఉంది. మొదట హైదరాబాద్‌ డెక్కన్ ఛార్జర్స్‌కు, అనంతరం ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్‌లో సైమండ్స్‌ను డెక్కన్ చార్జర్స్ 5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతడిని ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రెండు జట్ల తరఫున ఐపీఎల్‌లో 974 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

Full View


Tags:    

Similar News