Suresh Raina: ఏడ్చేసిన రైనా.. చెన్నై రాత ఇక మారనట్టేనా?
Suresh Raina: ధోని లాంటి ప్లేయర్ తీసుకుంటున్న నిర్ణయాలతో జట్టు గాడి తప్పుతుందన్న అభిప్రాయం పెరుగుతోంది.
Suresh Raina: ఏడ్చేసిన రైనా.. చెన్నై రాత ఇక మారనట్టేనా?
Suresh Raina: ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అంటే అద్భుతం. ఐపీఎల్ అంటే చెన్నై అనేలా అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించిన జట్టు, ఇప్పుడు అదే అభిమానులతో ఘోరమైన తిట్లు తిట్టించుకుంటుంది. చెన్నై జట్టు కేవలం ఫామ్ కోల్పోవడమే కాదు.. గౌరవం, గొప్పతనం కూడా కోల్పోతుంది. ఒకప్పుడు కాలర్ ఎగరేసి చెన్నై కోసం గర్వంగా మాట్లాడినవారే, ఇప్పుడు ఆ జట్టును చూసి అసహనంతో, ఆవేశంతో ఊగిపోతున్నారు. టీ20 క్రికెట్ ఎలా ఆడాలో కూడా తెలియని వాళ్లా అన్నట్టుగా చెన్నై ఆటగాళ్ల ముఖాలపై ఉండే బిక్కుబిక్కు చూపులు, అభిమానుల గుండెల్లో నిద్ర లేకుండా చేస్తున్నాయి. వేరే జట్ల అభిమానులు నవ్వుకుంటూ ఉండగా, సొంతవాళ్లే వెనక్కి తగ్గిపోతున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అలా చేయలేదు. ఆ వ్యక్తి వేదికపై కనబడినప్పటి నుంచి చెన్నై భవిష్యత్తు పట్ల తన మనసులోని కలవరాన్ని మాటల్లో కాదు, తన చూపుల ద్వారా చెప్పాడు. అతనే సురేష్ రైనా. ఒకప్పుడు సి.ఎస్.కె కి కీలక ఆటగాడు, అభిమానులు చిన్న తల అని పిలుచుకునే రైనా తెగ బాధపడిపోతున్నాడు.
చెపాక్‌లో చెన్నై కింగ్స్ రైడర్స్ చేతిలో చిత్తయ్యే దృశ్యాన్ని చూసిన రైనా ముఖంలో కనిపించిన ఆ నిశ్శబ్దత, ఆ కళ్లల్లో మెరిసిన కన్నీటిని చూసి సగటు చెన్నై ఫ్యాన్ గుండె బరువెక్కింది. ధోని ఎప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు వచ్చిన నిరాశ కన్నా ఎక్కువగా, రైనా చూపులో కనిపించిన బాధ కంటికి స్పష్టంగా కనిపించింది. అతను గ్రౌండ్‌లో లేడు, జట్టులో లేడు, కానీ ఆ జట్టుతో తన బంధం మునుపటిలాగే ఉంది. కెమరా అతనిపై పడ్డ ప్రతి సారి, కళ్లలో ఏమాత్రం ఆనందం లేదు. టీం ఓడిపోతున్నది చూసి ఒక్కసారి కూడా ఆగ్రహం చూపించలేదు. కానీ, లోలోపల పగిలిపోతున్న గుండె స్పష్టంగా కనబడింది.
ఒకప్పుడు అదే చెపాక్ స్టేడియంలో మ్యాజికల్ ఇన్నింగ్స్‌లు ఆడిన వ్యక్తి ఇప్పుడు అక్కడే కూర్చుని.. తన జట్టు ఎలా దిగజారిపోతుందో చూస్తూ ఉండిపోవడం చూసి అభిమానుల గుండె ముక్కలవుతోంది. ట్విట్టర్‌లో రైనాకి పిలుపు ఇస్తూ, జట్టులోకి తిరిగి రావాలని కొందరు వేడుకుంటుంటే, మరికొందరు కనీసం రైనా లాంటి ఆటగాళ్ల కోసం అయినా జట్టు పోరాడాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ధోనికి ఉన్న అభిమానమంతా ఇంకా అలాగే ఉన్నా, జట్టుకు అతని నాయకత్వం ఉపయోగపడుతున్నదా అన్న సందేహం తలెత్తుతోంది. అసలు జట్టులో అతని స్థానమే ఓ విడ్డూరం. ధోని లాంటి ప్లేయర్ తీసుకుంటున్న నిర్ణయాలతో జట్టు గాడి తప్పుతుందన్న అభిప్రాయం పెరుగుతోంది.