IPL 2023: క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై విజయభేరి

IPL 2023: ఐపీఎల్ 16 సీజన్లలో 10వసారి ఫైనల్‌ చేరిన చెన్నై

Update: 2023-05-24 02:07 GMT

IPL 2023: క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై విజయభేరి

IPL 2023: ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సాధికార విజయాన్ని సాధించి... నేరుగా ఫైనల్ చేరుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుని ఫైనల్లోకి కాలుమోపింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇవాళ చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ను చేజిక్కించుకుని అనుభవజ్ఞుల ఆటతీరు ఏంటోనని గుజరాత్ టైటాన్స్ కు రుచి చూపించారు. లీగ్ దశలో దూకుడుమీదున్న గుజరాత్ జట్టు ప్రత్యర్థి జట్లను వణికించింది. లీగ్ దశలో 14 మ్యాచుల్లో 10 విజయాలను సాధించిన ఏకైక జట్టుగా గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇవాళ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ దూకుడుకు చెన్నై సారధి మహేంద్ర సింగ్ ధోని వ్యూహాత్మకంగా వ్యవహించి బంతులు సంధించే విధంగా బౌలర్లను పురమాయించే ప్రయత్నంలో సఫలమయ్యారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 172 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్ మెన్ రుతురాజ్ గైక్వాడ్ దూకుడును ప్రదర్శించి 44 బంతుల్లో 60 పరుగులు నమోదు చేశాడు. కాన్వే 40 పరుగులు, రవీంద్ర జడేజా 22 పరుగులు, ఆజింక్యా రెహానె 17 పరుగులు, అంబటి రాయుడు 17 పరుగులు అందించారు. లీగ్ దశలో సిక్సర్లతో చెలరేగిన అభిమానులను అలరించిన ధోనీ, శివం దుబే ఇద్దరూ ఒక్కో పరుగుతోనే సరిపెట్టుకున్నారు. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడు తొలి బంతినుంచే నియంత్రించే పనిలో చెన్నై సఫలీకృతమైంది.

గుజరాత్ టైటాన్స్ తరఫున నిన్న మొన్నటిదాకా భారీస్కోర్లతో జట్టును గట్టెక్కించిన శుభమన్ గిల్ 42 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ తో 30 పరుగులు అందించాడు. దాసున్ శనక 17 పరుగులు, వృద్ధిమాన్ సాహా 12 పరుగులు చేయగా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

Tags:    

Similar News