BCCI : ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డ్..వీడియో క్వాలిటీ మాత్రం దారుణం..మండిపడుతున్న రోకో ఫ్యాన్స్
BCCI : భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఇటీవల దేశీయ టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లలో ఆడి సెంచరీలు సాధించారు.
BCCI : ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డ్..వీడియో క్వాలిటీ మాత్రం దారుణం..మండిపడుతున్న రోకో ఫ్యాన్స్
BCCI : భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఇటీవల దేశీయ టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లలో ఆడి సెంచరీలు సాధించారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి కోట్లాది మంది అభిమానులు, ఆ అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించలేకపోయారు. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లకు ఎలాంటి లైవ్ టెలికాస్ట్ లేదా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డ్ అయిన బీసీసీఐ, ఇంతటి ప్రముఖ ఆటగాళ్లు ఆడిన మ్యాచ్‌లను కూడా ఎందుకు ప్రసారం చేయలేదని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అభిమానుల ఆగ్రహం మధ్య, బీసీసీఐ ఆర్థిక స్థితికి సంబంధించిన ఒక వార్త బయటికి వచ్చింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. భారత క్రికెట్ బోర్డు 2025 సంవత్సరంలో ఏకంగా రూ.3358 కోట్ల భారీ లాభాన్ని ఆర్జించింది. 2025లో డ్రీమ్ 11 వంటి కొన్ని కీలక ఒప్పందాలు మధ్యలో రద్దయినా, అపోలో టైర్స్, అడిడాస్ వంటి కంపెనీలతో కొత్త ఒప్పందాలు చేసుకోవడం ద్వారా బీసీసీఐ ఈ అద్భుతమైన లాభాన్ని నమోదు చేయగలిగింది. అంతేకాకుండా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ సుమారు రూ.8963 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని అంచనా. ఐసీసీ మొత్తం ఆదాయంలో ఏకంగా 38.5 శాతం వాటాను బీసీసీఐ పొందుతుంది. ఇది మరే ఇతర బోర్డుకూ లేని భారీ వాటా. ఇంతటి ఆర్థిక బలం ఉన్నప్పటికీ, దేశీయ మ్యాచ్‌లను ప్రసారం చేయకపోవడంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీసీసీఐకి వచ్చిన భారీ లాభాల వార్త, దేశీయ క్రికెట్ కవరేజీ లేకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఇంత డబ్బు ఉన్నప్పటికీ, కనీసం కెమెరాలు ఏర్పాటు చేసి స్ట్రీమింగ్ చేయలేరా అని అభిమానులు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దేశీయ మ్యాచ్‌లకు సరైన కవరేజీ ఇవ్వకపోవడంపై ఆరోపణలు రావడమే కాకుండా, బీసీసీఐ తమ అధికారిక సోషల్ మీడియా పేజీలలో షేర్ చేసిన విరాట్, రోహిత్ బ్యాటింగ్ వీడియోలు కూడా చాలా తక్కువ క్వాలిటీతో ఉండటంతో అభిమానులు ఆగ్రహించారు. కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న బోర్డు, కనీసం మెరుగైన వీడియో పరికరాలను ఉపయోగించలేకపోవడంపై సిగ్గు సిగ్గు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. స్టార్ ప్లేయర్‌ల వ్యక్తిగత ప్రదర్శనలను కూడా అభిమానులు చూడలేకపోతే, దేశీయ క్రికెట్‌ను ప్రోత్సహించడం ఎలా సాధ్యమని బీసీసీఐని అభిమానులు నిలదీస్తున్నారు.