BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌ల వేదికలు
భారత జట్టు వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో ఆడే టెస్టు మ్యాచ్‌ల వేదికల్లో స్వల్ప మార్పులు జరిగాయి
BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌ల వేదికలు
BCCI: భారత జట్టు వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో ఆడే టెస్టు మ్యాచ్‌ల వేదికల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అంతేకాదు, భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాతో ఆడే వన్డే సిరీస్ వేదికలు, సౌతాఫ్రికా-ఏ జట్టుతో భారత్-ఏ జట్టు ఆడే వన్డే మ్యాచ్‌ల వేదికల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
దక్షిణాఫ్రికా జట్టు ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించనుంది. అంతకంటే ముందు మన టీమ్ వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే, అక్టోబర్ 10 నుంచి 14 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన రెండో టెస్ట్ మ్యాచ్‌ని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మార్చారు. అలాగే, దక్షిణాఫ్రికాతో జరిగే మొదటి టెస్ట్‌ను ఢిల్లీ నుంచి కోల్‌కతాకు మార్చారు. ఇది నవంబర్ 14 నుంచి 18 వరకు జరుగుతుంది. ఢిల్లీలో నవంబర్‌లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక మహిళల క్రికెట్ విషయానికి వస్తే, భారత మహిళల జట్టు సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం చిదంబరం స్టేడియంలో పిచ్ మరియు ఔట్ ఫీల్డ్ మరమ్మత్తులు జరుగుతున్నాయి. అందుకే ఈ సిరీస్ వేదికను మార్చారు. మొదటి రెండు వన్డేలను న్యూ ఛండీగఢ్‌లోని పీసీఏ స్టేడియంలో, చివరి వన్డేను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహిస్తారు.
దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరిగే వన్డే సిరీస్‌లో కూడా మార్పులు జరిగాయి. ఈ జట్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడాల్సి ఉంది. టెస్టు మ్యాచ్‌లు బెంగళూరులోనే జరుగుతాయి, కానీ వన్డే సిరీస్‌ను (నవంబర్ 13, 16, 19 తేదీల్లో) రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి మార్చారు.