Smriti Mandhana : నెరవేరిన స్మృతి మంధాన డిమాండ్.. విశాఖ స్టేడియంలో దిగ్గజ మహిళా క్రికెటర్లకు అరుదైన గౌరవం

ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 లో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉంది.

Update: 2025-10-07 05:39 GMT

Smriti Mandhana : నెరవేరిన స్మృతి మంధాన డిమాండ్.. విశాఖ స్టేడియంలో దిగ్గజ మహిళా క్రికెటర్లకు అరుదైన గౌరవం

Smriti Mandhana : ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 లో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉంది. ఈ ఉత్సాహం మధ్య ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఒక కీలక ప్రకటన చేసింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన చేసిన ఒక సూచనను నిజం చేస్తూ.. అక్టోబర్ 12న విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌కు ముందు ఇద్దరు దిగ్గజ మహిళా క్రికెటర్లను సన్మానించనుంది. ఈ నిర్ణయం భారత క్రికెట్‌లో మహిళల పాత్రకు ఇస్తున్న అరుదైన గౌరవం.

భారత మహిళా క్రికెటర్లను గౌరవించాలని స్మృతి మంధాన చేసిన డిమాండ్‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సానుకూలంగా స్పందించింది. విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలోని రెండు స్టాండ్‌లకు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెటర్ రవి కల్పనల పేర్లు పెట్టనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. క్రికెట్‌లో మహిళల గొప్ప సహకారాన్ని గౌరవించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక స్టాండ్‌కు మిథాలీ రాజ్ పేరు, ఒక గేటుకు రవి కల్పన పేరు పెట్టడం ఆంధ్రప్రదేశ్, భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం కానుంది.

ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి 2025 ఆగస్టులోనే బీజం పడింది. ఆ సమయంలో జరిగిన బ్రేకింగ్ బౌండ్రీస్ చర్చా కార్యక్రమంలో స్మృతి మంధాన, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడారు. భారతదేశంలోని స్టేడియాలలో పురుష క్రికెట్ దిగ్గజాల పేరు మీద స్టాండ్‌లు, గేట్లు ఉన్నప్పటికీ, మహిళా క్రికెటర్లకు అలాంటి గుర్తింపు దక్కడం లేదని మంధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంధాన విజ్ఞప్తికి మంత్రి లోకేష్ వెంటనే స్పందించి, ACAతో మాట్లాడటం వలన ఈ చారిత్రక నిర్ణయం సాధ్యమైంది.

మిథాలీ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె మాజీ భారత కెప్టెన్, మహిళా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్లలో ఒకరు. ఆమె అద్భుతమైన కెరీర్ అనేక తరాల క్రీడాకారులకు స్ఫూర్తిని ఇచ్చింది. మిథాలీ భారత్ తరపున 300 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి, 10 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించింది. మరోవైపు, రవి కల్పన ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్. ఆమె రాష్ట్ర క్రికెట్ నుండి భారత జట్టు వరకు ఎదిగిన ప్రయాణం, ఈ ప్రాంతంలోని అనేక మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చింది.

Tags:    

Similar News