Rohit Sharma: హిట్‌మ్యాన్@38.. ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డుల వీరుడు రోహిత్ శర్మ!
Rohit Sharma: ఐపీఎల్ రికార్డుల రారాజు, ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ నేడు తన 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు.
Rohit Sharma: హిట్‌మ్యాన్@38.. ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డుల వీరుడు రోహిత్ శర్మ!
Rohit Sharma: ఐపీఎల్ రికార్డుల రారాజు, ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ నేడు తన 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడంలో దిట్టైన రోహిత్, బంతితోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 6000లకు పైగా పరుగులు, హ్యాట్రిక్‌తో ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డు సృష్టించిన ఈ "హిట్‌మ్యాన్" మరిన్ని అరుదైన ఘనతల గురించి వివరంగా తెలుసకుందాం.
ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్, "హిట్‌మ్యాన్"గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రోహిత్ శర్మ నేడు 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ టోర్నమెంట్‌లో రోహిత్ నెలకొల్పిన కొన్ని రికార్డులు చెరిగిపోని ముద్ర వేసుకున్నాయి. అతడు తన మెరుపు బ్యాటింగ్‌తో భారీ సిక్సర్లతో ప్రేక్షకులను అలరించడంలో దిట్ట. అయితే, చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు రోహిత్ కెరీర్ ప్రారంభంలో బౌలింగ్ కూడా చేసేవాడని, ఐపీఎల్‌లో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడని. ఈ లీగ్‌లో 6000కు పైగా పరుగులు సాధించడంతో పాటు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు అతడే. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ నెలకొల్పిన 5 తిరుగులేని రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
6000లకు పైగా పరుగులు, హ్యాట్రిక్
రోహిత్ 18 సంవత్సరాల క్రితం కేవలం 20 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ ఆడటం ప్రారంభించాడు. మొదటి మూడు సీజన్లలో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఆ సమయంలోనే బౌలింగ్‌లో హ్యాట్రిక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2009లో తన ప్రస్తుత జట్టు ముంబై ఇండియన్స్‌పైనే ఈ ఘనత సాధించడం విశేషం. 2011లో ముంబై జట్టులో చేరిన రోహిత్ 12 సంవత్సరాల తర్వాత 2023లో ఈ టోర్నమెంట్‌లో 6000 పరుగుల మైలురాయిని దాటాడు. తద్వారా ఐపీఎల్‌లో 6000కు పైగా పరుగులు, హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ 266 మ్యాచ్‌లలో 6868 పరుగులు చేసి విరాట్ కోహ్లీ (8447) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.
ఫైనల్‌లో రెండు అర్ధ సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్
రోహిత్ శర్మను పెద్ద మ్యాచ్‌ల ఆటగాడిగా పరిగణిస్తారు. కీలకమైన సమయాల్లో జట్టు కోసం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో కూడా అతడు ఇది నిరూపించాడు. ఐపీఎల్ ఫైనల్‌లో రెండు అర్ధ సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్ రోహిత్ మాత్రమే. 2015లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 26 బంతుల్లో 50 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అలాగే 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో 51 బంతుల్లో 68 పరుగులు చేసి ముంబైకి ఐదో టైటిల్‌ను అందించాడు.
అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు
రోహిత్ శర్మ ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌పై 76 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (POTM) అవార్డును గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో ఇది అతనికి 20వ POTM అవార్డు. తద్వారా 20 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అతని తర్వాత మరే భారతీయ బ్యాట్స్‌మెన్ ఈ ఘనత సాధించలేకపోయాడు. ఈ లీగ్‌లో అత్యధిక POTM అవార్డులు గెలుచుకున్న వారిలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు ఏబీ డివిలియర్స్ (25), క్రిస్ గేల్ (22) మాత్రమే ఉన్నారు.
అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు
రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. ఈ లీగ్‌లో ఎంఎస్ ధోని మాత్రమే అతని సరసన నిలిచాడు. అంటే రోహిత్ సంయుక్తంగా అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న కెప్టెన్. అంతేకాకుండా 2009లో డెక్కన్ ఛార్జర్స్‌తో ఒక ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అంటే ఒక ఆటగాడిగా అతని ఖాతాలో 6 ఐపీఎల్ టైటిళ్లు ఉన్నాయి. ఈ రికార్డు కేవలం అంబటి రాయుడు పేరు మీద మాత్రమే ఉంది.
అత్యధిక సిక్సర్లు
రోహిత్ శర్మ తన భారీ సిక్సర్లు కొట్టే సామర్థ్యంతో, మ్యాచ్‌లను గెలిపించే నైపుణ్యంతో బాగా ప్రసిద్ధి చెందాడు. అందుకే అతనికి 'హిట్‌మ్యాన్' అనే పేరు వచ్చింది. ఐపీఎల్‌లో కూడా అతడు దానిని నిరూపించాడు. ఈ లీగ్‌లో అత్యధిక సిక్సర్లు (297) కొట్టిన భారతీయ ఆటగాడు రోహిత్. అతని కంటే ముందు క్రిస్ గేల్ (357) మాత్రమే ఉన్నాడు.