వైకుంఠ ఏకాదశి 2025: ముక్కోటి ఏకాదశి వేళ శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ఎందుకు అంత ప్రత్యేకం?

వైష్ణవులకు అత్యంత పవిత్రమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. ఈ రోజున భూలోక వైకుంఠంగా పేరొందిన తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Update: 2025-12-29 07:23 GMT

వైకుంఠ ఏకాదశి 2025: ముక్కోటి ఏకాదశి వేళ శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ఎందుకు అంత ప్రత్యేకం?

వైష్ణవులకు అత్యంత పవిత్రమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. ఈ రోజున భూలోక వైకుంఠంగా పేరొందిన తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో జరిగే వేడుకలు భక్తుల మనసులను ఆకట్టుకుంటాయి.

శ్రీరంగం పట్టణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయం సుమారు 156 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. తిరువరంగం అని కూడా పిలవబడే ఈ క్షేత్రం, తమిళ నిర్మాణ శైలికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ కొలువైన రంగనాథస్వామి శ్రీమహావిష్ణువు శేషతల్పంపై యోగనిద్రలో ఉన్న రూపంలో దర్శనమిస్తారు.

పురాణాల ప్రకారం, సృష్టి ఆరంభ కాలంలో విష్ణుమూర్తి తన నాభి నుంచి బ్రహ్మను సృష్టించి, అతనికి సకల శాస్త్రాలను బోధించారు. బ్రహ్మ కోరిక మేరకు, విష్ణువు రంగనాథస్వామి రూపంలో అర్చావతారంగా కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ దివ్య విగ్రహాన్ని బ్రహ్మదేవుడు విరజా నది తీరంలో ప్రతిష్టించగా, తరువాత అది ఇక్ష్వాకు వంశానికి, శ్రీరామచంద్రుని వద్దకు చేరింది.

శ్రీరాముడు తన అవతార పరిసమాప్తి వేళ ఈ రంగనాథ స్వామి విగ్రహాన్ని విభీషణుడికి దానం చేస్తాడు. లంకకు తీసుకెళ్లే క్రమంలో కావేరి నది తీరంలో జరిగిన సంఘటనల వల్ల ఈ విగ్రహం అక్కడే స్థిరపడింది. అదే ప్రదేశమే నేటి శ్రీరంగం క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

శ్రీమహావిష్ణువు దైవ నిర్ణయంగా ఇక్కడే కొలువుదీరి, ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) గుండా దర్శనం ఇచ్చే వరం ప్రసాదించాడు. అప్పటి నుంచే శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశిని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఈ పవిత్ర రోజున రంగనాథస్వామిని వజ్రాభరణాలు, దివ్య వస్త్రాలతో అలంకరించి, వెయ్యి స్తంభాల మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దర్శనం లభిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీరంగం చేరుకుంటారు.

Tags:    

Similar News