8 నుంచి శ్రీవారి దర్శనం.. టీటీడీ కొత్త మార్గదర్శకాలు..

Update: 2020-06-06 07:42 GMT

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తిరుమల శ్రీనివాసుడి దర్శనం భక్తులకు కలుగబోతున్నది. కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌తో కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి దర్శనభాగ్యం లేకుండా పోయింది ఆలయంలో నిత్యం జరిగే పూజలు నిర్వహిస్తున్నా..భక్తులకు అనుమతి నిలిపివేశారు. తాజాగా లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో ఈనెల 8 నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతించబోతున్నారు. దర్శనానికి సంబంధించి టీటీడీ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో భక్తులకు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 8 నుంచి భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతించనున్నారు. దర్శనానికి సంబంధించి టీటీడీ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. మొదటి మూడు రోజులు టీటీడీ ఉద్యోగులు, సిబ్బందికి ఆ తర్వాత 15 రోజులు తిరుపతి, తిరుమలవాసులకు దర్శన వసతి కల్పించనున్నారు.

తిరుమల స్వామి దర్శనానికి అనుమతి ఇవ్వడంతో శ్రీవారి ఆలయంలో అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. క్యూలైన్‌ కదలికను గుర్తించేందుకు గంటకు ఎంత మందిని దర్శనానికి పంపగలుగుతామనే అంశంపై పరిశీలించారు. వందమంది టీటీడీ ఉద్యోగులతో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పరిశీలించారు. ఈనెల 8,9,10 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో శ్రీవారి దర్శనాలు ట్రయన్‌ రన్‌ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇస్తూ స్వామి వారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు 7వేల మందికి దర్శనం కల్పించడానికి అవకాశం ఉందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా 3వేల మందిని అనుమతిస్తుండగా అలిపిరి దగ్గర ఏర్పాటు చేసిన టికెట్‌ కౌంటర్‌ దగ్గర 3 వేల మంది టికెట్‌ తీసుకునే సౌకర్యం కల్పించింది టీటీడీ. ఉదయం ఆరు గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే దర‌్శనానికి అనుమతిచ్చింది. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి గంట సేపు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కల్పించనున్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి, పదేళ్ల లోపు పిల్లలకు అనుమతి లేదని టీటీడీ వెల్లడించింది. కొన్ని రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ.

తిరుమలకు వచ్చే ప్రతీ భక్తుడికి పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇందుకు అలిపిరి దగ్గర పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలిపిరి ద్వారానే కాలినడకన వెళ్లే భక్తులకు అనుమతి ఉంటుందని శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసివేస్తామన్నారు. భక్తులు టీటీడీకి సహకరించాలని కోరారు.

తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, కల్యాణకట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్న ప్రసాద కేంద్రం వద్ద చేతులు శుభ్రపరుచుకునే ప్రాంతంలో భక్తులు జాగ్రత్త వహించాలన్నారు. కొన్ని రోజుల పాటు తీర్థం శఠారి రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. 

Tags:    

Similar News