New Year Visit These Temples: కొత్త సంవత్సరం.. ఈ దేవాలయాలను సందర్శిస్తే అష్టైశ్వార్యాలు మీ సొంతం!

కొత్త సంవత్సరం వచ్చిందంటే అందరి మనసుల్లో ఒకే కోరిక… ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సు.

Update: 2025-12-31 12:03 GMT

New Year Visit These Temples: కొత్త సంవత్సరం.. ఈ దేవాలయాలను సందర్శిస్తే అష్టైశ్వార్యాలు మీ సొంతం!

కొత్త సంవత్సరం వచ్చిందంటే అందరి మనసుల్లో ఒకే కోరిక… ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సు. ఆ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ చాలా మంది దేవుడి దర్శనంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలనుకుంటారు. దేవుడిపై నమ్మకంతో సంవత్సరం మొదలుపెడితే మనసుకు ధైర్యం పెరుగుతుందని, జీవితంలో ముందుకు సాగేందుకు ఆత్మవిశ్వాసం కలుగుతుందని విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఏడాది జనవరి 1న దేశవ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.

ఆలయ దర్శనం మనసుకు ప్రశాంతతనిచ్చి, సానుకూల ఆలోచనలను పెంచుతుంది. 2026 సంవత్సరం ఆనందంగా, శుభప్రదంగా గడవాలనుకునే వారు కొత్త సంవత్సరం రోజున కొన్ని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శిస్తే అష్టైశ్వార్యాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పవిత్ర ఆలయాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

అయోధ్యలోని శ్రీరామాలయం

అయోధ్యలోని శ్రీరామాలయం అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు. ఇది శ్రీరాముడు జన్మించిన భూమిగా ప్రసిద్ధి. రామ్‌లల్లా ప్రతిష్ఠ అనంతరం ఈ ఆలయానికి భక్తుల రాక మరింత పెరిగింది. కొత్త సంవత్సరం రోజున శ్రీరామ దర్శనం చేసుకుంటే మనసు భక్తితో నిండిపోతుందని, జీవితంలో శాంతి, గౌరవం, విజయాలు లభిస్తాయని నమ్మకం.

ముంబై సిద్ధి వినాయక ఆలయం

ఏ కొత్త పని ప్రారంభించాలన్నా ముందుగా గణేశుడిని పూజించడం మన సంప్రదాయం. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధ గణేశ ఆలయాల్లో ఒకటి. జనవరి 1న ఇక్కడకు లక్షలాది మంది భక్తులు వస్తారు. గణేశుడి ఆశీస్సులతో జీవితంలోని అడ్డంకులు తొలగి, సరైన మార్గం దొరుకుతుందని విశ్వసిస్తారు. 2026ను నిరాటంకంగా ప్రారంభించాలనుకునే వారు ఈ ఆలయాన్ని దర్శించవచ్చు.

కాశీ విశ్వనాథ ఆలయం

వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం శివుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. గంగానది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో జనవరి 1న గంగ స్నానం చేసి శివ దర్శనం చేయడం ఎంతో శుభప్రదమని అంటారు. శివుడి ఆశీస్సులతో పాపాలు తొలగి, ఆధ్యాత్మిక బలం, మనశ్శాంతి లభిస్తాయని నమ్మకం.

షిర్డీ సాయిబాబా ఆలయం

మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. సాయిబాబా ప్రేమ, నమ్మకం, సమానత్వానికి ప్రతీకగా భావిస్తారు. కొత్త సంవత్సరాన్ని సాయిబాబా దర్శనంతో ప్రారంభిస్తే జీవితంలో శాంతి, సమతుల్యత, సానుకూల మార్పులు వస్తాయని భక్తుల విశ్వాసం. 2026ను ప్రశాంతంగా గడపాలనుకునే వారు షిర్డీని సందర్శించవచ్చు.

ఉజ్జయిని మహాకాళి (మహాకాలేశ్వర) ఆలయం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాలేశ్వర ఆలయం దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం. ఇక్కడ జరిగే భస్మ ఆరతి ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మహాకాలుడిని దర్శిస్తే కాలభయం, మరణభయం తొలగిపోతాయని నమ్మకం ఉంది. 2026లో స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, శ్రేయస్సు కోరుకునే వారు ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు.

మొత్తానికి, కొత్త సంవత్సరం రోజున దేవాలయ దర్శనంతో సంవత్సరాన్ని ప్రారంభించడం ఒక మంచి అలవాటు, శుభ ఆరంభంగా భావిస్తారు. భక్తి, విశ్వాసంతో వేసిన తొలి అడుగు… జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుందని నమ్మకం.

Tags:    

Similar News