Medaram Jatara 2026? సమ్మక్క సారలమ్మ దర్శనంతో పాటు ఈ 5 అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్ కావద్దు!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు తప్పక సందర్శించాల్సిన పర్యాటక ప్రాంతాలు. లక్నవరం, రామప్ప, బోగత జలపాతం వంటి ప్రదేశాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఈ వన జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే, మేడారం వెళ్లే భక్తులు కేవలం అమ్మవార్ల దర్శనంతోనే తిరిగి రాకుండా, ములుగు జిల్లాలోని మరికొన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. లక్నవరం సరస్సు (Laknavaram Lake)
మేడారానికి అతి సమీపంలో ఉన్న ప్రకృతి ఒడి ఇది. చుట్టూ దట్టమైన అడవి, కొండల మధ్యలో ఉండే ఈ సరస్సు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడి సస్పెన్షన్ బ్రిడ్జ్ (తీగల వంతెన) పై నడవడం ఒక అద్భుత అనుభవం. సరస్సులో బోటింగ్ చేస్తూ చిన్న చిన్న ద్వీపాలను చూడటం పర్యాటకులకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.
2. రామప్ప దేవాలయం (Ramappa Temple)
కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం ఈ రామప్ప గుడి. యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం మేడారం వెళ్లే దారిలోనే ఉంటుంది. ఇక్కడి రామప్ప చెరువు, ఆలయంలోని నంది విగ్రహం, రాతిపై చెక్కిన శిల్పాలు ప్రతి ఒక్కరూ చూడాల్సిందే.
3. బోగత జలపాతం (Bogatha Waterfalls)
తెలంగాణ నయాగరాగా పిలవబడే బోగత జలపాతం ములుగు జిల్లాలోనే ఉంది. పచ్చని ప్రకృతి మధ్య కొండలపై నుంచి జాలువారే నీటిని చూడటం కనువిందుగా ఉంటుంది. కుటుంబంతో కలిసి పిక్నిక్ వెళ్లడానికి ఇది బెస్ట్ ప్లేస్.
4. బయ్యక్కపేట (Bayyakkapeta)
సమ్మక్క తల్లి జన్మించిన పవిత్ర గ్రామం ఇది. చరిత్ర ప్రకారం సమ్మక్క-సారలమ్మ జాతర మొదట ఇక్కడే ప్రారంభమైందట. ఇక్కడ సమ్మక్క జన్మించిన పుట్ట, ఆమె నివసించిన ఇల్లు ఇప్పటికీ పర్యాటకులు చూడవచ్చు. ఇప్పటికీ ఆ ఇంటిలో సమ్మక్క తల్లి పాము రూపంలో ఉంటుందని స్థానికుల బలమైన నమ్మకం.
5. గిరిజన మ్యూజియం (Tribal Museum)
మేడారం సమీపంలోని రెడ్డిగూడెంలో ఈ మ్యూజియం ఉంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, వారి జీవనశైలిని ప్రతిబింబించేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. సమ్మక్క-సారలమ్మ వీరగాథలకు సంబంధించిన చిత్రాలు, వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. గిరిజన చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వేదిక.