Viral Video: ముందుకూ వెనక్కూ కదలలేక.. ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లో బుక్కైన దొంగ

రాజస్థాన్ కోటాలో చోరీకి వచ్చిన దొంగ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కున్న ఘటన వీడియోగా వైరల్‌గా మారింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2026-01-06 09:17 GMT

Viral Video: ముందుకూ వెనక్కూ కదలలేక.. ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లో బుక్కైన దొంగ

రాజస్థాన్‌లోని కోటా నగరంలో చోటు చేసుకున్న ఓ విచిత్రమైన చోరీ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట్లోకి చోరీ చేయడానికి వచ్చిన దొంగ కిచెన్‌లో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోవడంతో ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.

కోటా ప్రతాప్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఖాటూ శ్యామ్ జీ దర్శనం కోసం ఇంటిని లాక్ చేసి బయటకు వెళ్లింది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. తలుపులు మూసి ఉండటంతో కిచెన్‌లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా లోపలికి వెళ్లాలని భావించారు.

అయితే ఈ క్రమంలో ఓ దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. ముందుకు వెళ్లలేక, వెనక్కు రావలేక మధ్యలోనే చిక్కుకుని లబోదిబోమంటూ అరవడం ప్రారంభించాడు. అదే సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు రాత్రి 1 గంట ప్రాంతంలో కిచెన్ నుంచి వినిపించిన అరుపులు విని అక్కడికి వెళ్లి చూసి షాక్ అయ్యారు.

వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కున్న దొంగను బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. మరో దొంగ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.


ఈ ఘటనను అక్కడున్నవారు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం కోటాలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News