Viral Video : దేవుడు మనిషి రూపంలో రావడం అంటే ఇదేనేమో..ఆ చిన్నారికి సెక్యూరిటీ గార్డ్ రూపంలో పునర్జన్మ!
Viral Video : ప్రమాదం ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా పసిపిల్లల విషయంలో క్షణం పాటు కళ్లు పక్కకు తిప్పినా ఏదైనా జరగవచ్చు.
Viral Video : ప్రమాదం ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా పసిపిల్లల విషయంలో క్షణం పాటు కళ్లు పక్కకు తిప్పినా ఏదైనా జరగవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీ గుండె ఆగినంత పనవుతుంది. ఒక సెకను ఆలస్యమైనా ఒక నిండు ప్రాణం బలి అయిపోయేది. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ చూపిన సమయస్ఫూర్తి ఆ పసివాడిని మృత్యు ముఖం నుండి కాపాడింది. ప్రస్తుతం ఈ రియల్ హీరో సాహసం నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెద్ద భవనంలో ఎలివేటర్ (లిఫ్ట్) మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. లిఫ్ట్ తలుపులు తెరిచి ఉన్నాయి, లోపల ఏమీ లేదు.. కేవలం ఒక లోతైన గుంత మాత్రమే ఉంది. ఆ సమయంలో ఒక చిన్నారి అక్కడ ఆడుకుంటూ ఏమాత్రం భయం లేకుండా ఆ తెరిచి ఉన్న లిఫ్ట్ ద్వారం వైపు వెళ్లసాగాడు. ఇంకో అడుగు వేస్తే నేరుగా ఆ లోతైన గుంతలో పడిపోయేవాడే. వీడియో చూస్తున్న నెటిజన్లందరికీ ఆ క్షణంలో ఊపిరి ఆగిపోయినంత పనైంది.
సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ చిన్నారిని గమనించాడు. అతను ఏమాత్రం కంగారు పడి అరవలేదు.. ఎందుకంటే తను గట్టిగా అరిస్తే ఆ పిల్లోడు భయపడి ముందుకు దూకే అవకాశం ఉంది. అందుకే చాలా నిశ్శబ్దంగా, అత్యంత వేగంగా అడుగులు వేస్తూ వెళ్లి.. ఆ చిన్నారి ప్రమాదపు అంచున ఉన్న క్షణంలో వెనక నుండి ఒడిసి పట్టుకున్నాడు. రెప్పపాటు కాలంలో జరిగిన ఈ రెస్క్యూ ఆ చిన్నారికి పునర్జన్మను ఇచ్చింది. గార్డ్ చూపిన ఈ ధైర్యం, ఓపిక ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆ గార్డ్‌కు రివార్డు ఇవ్వాలని చాలామంది కోరుతున్నారు. అయితే అదే సమయంలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. భవనంలో అంత ప్రమాదకరమైన పని జరుగుతున్నప్పుడు లిఫ్ట్ దగ్గర ఎందుకు బారికేడ్లు పెట్టలేదు? అసలు అంత చిన్న పిల్లోడు ఒంటరిగా అక్కడికి ఎలా వచ్చాడు? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇలాంటి పనులు జరిగే చోట పిల్లలను అస్సలు వదలకూడదని ఈ వీడియో మరోసారి హెచ్చరిస్తోంది.