Rajasthan Woman Farmer: ఎడారి నేలపై ఆర్గానిక్ యాపిల్స్.. రిపబ్లిక్ డే అతిథిగా సంతోష్ దేవి
Rajasthan Woman Farmer: ఎడారి లాంటి బీడు భూముల్లో యాపిల్స్, దానిమ్మ పండించిన రాజస్థాన్ మహిళా రైతు సంతోష్ దేవికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం లభించింది.
Rajasthan Woman Farmer: ఎడారి నేలపై ఆర్గానిక్ యాపిల్స్.. రిపబ్లిక్ డే అతిథిగా సంతోష్ దేవి
Rajasthan Woman Farmer: రాజస్థాన్‌కు చెందిన మహిళా రైతు సంతోష్ దేవి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సాగుకు ఏమాత్రం అనుకూలం కాని ఎడారి లాంటి బీడు భూముల్లో దానిమ్మ, యాపిల్ వంటి పండ్లను సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తూ ఆదర్శంగా నిలిచిన ఆమెకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం లభించింది.
సికార్ జిల్లాలోని బేరీ గ్రామానికి చెందిన సంతోష్ దేవి తన 17 ఏళ్ల కఠోర శ్రమకు దక్కిన గౌరవంగా ఈ ఆహ్వానాన్ని భావిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల క్రితం రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వాన పత్రం అందిందని, అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారని వెల్లడించారు.
రసాయనాలు లేకుండా సేంద్రియ సాగులో దానిమ్మ, యాపిల్, జామ పండ్లను పండిస్తున్న సంతోష్ దేవి పొలంలో దానిమ్మ పండ్లు 800 గ్రాముల వరకు, యాపిల్స్ 200 గ్రాముల వరకు బరువు తూగుతుండటం విశేషం. ఒకప్పుడు తన కుటుంబ ఆదాయం నెలకు రూ.3 వేలకే పరిమితమై ఉండగా, ప్రస్తుతం వ్యవసాయం ద్వారా నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నట్లు ఆమె వివరించారు.
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా స్వయం ఉపాధితో ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. వ్యవసాయం లాభదాయకం కాదనే భావనను తాను తప్పని నిరూపించానని పేర్కొన్నారు. సంతోష్ దేవి స్ఫూర్తితో హార్టికల్చర్ రంగంలో అనేక మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆమె ప్రతి సంవత్సరం సుమారు 80 వేల మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు.
ఇదే క్రమంలో 2016–17 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే నుంచి లక్ష రూపాయల అవార్డు అందుకున్న అనంతరం తన ప్రయాణం మరింత ముందుకు సాగిందని సంతోష్ దేవి గుర్తుచేసుకున్నారు.