Viral Video : వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా? మెట్రోలో యువకుడి వెర్రి చేష్టలపై నెటిజన్ల ఆగ్రహం
వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా? మెట్రోలో యువకుడి వెర్రి చేష్టలపై నెటిజన్ల ఆగ్రహం
Viral Video : సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం జనం ఏ స్థాయికైనా దిగజారుతున్నారు. ఈ మధ్య కాలంలో రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడటంతో, సామాన్య ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో రైళ్లలో కొందరు ఆకతాయిలు చేస్తున్న విన్యాసాలు ప్రయాణికులను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. తాజాగా మెట్రోలో ఒక యువకుడు చేసిన వెర్రి వేషాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ప్రయాణికులు ప్రశాంతంగా కూర్చున్న సమయంలో సడన్‌గా ఆ యువకుడు మెట్రో కోచ్ మధ్యలోకి వచ్చి కోతి చేష్టలు మొదలుపెట్టాడు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో మెట్రో రైలు తన వేగంతో తాను వెళ్తుంటే, ఒక యువకుడు ఉన్నట్టుండి పోల్ పట్టుకుని వేలాడటం, వింత వింత డాన్స్ మూమెంట్లతో హంగామా చేయడం కనిపిస్తుంది. అతని అత్యుత్సాహం ఏ స్థాయికి చేరిందంటే, పక్కనే కూర్చున్న మహిళా ప్రయాణికులు తీవ్రంగా భయపడిపోయారు. ఆ యువకుడి వెర్రి చేష్టలను చూసి ఒక యువతి అయితే తన సీటు వదిలిపెట్టి పక్క కోచ్‌లోకి పరుగులు తీసింది. ఆ యువకుడు తన రక రకాల ఎక్స్‌ప్రెషన్లతో ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా తన షూటింగ్‌లో మునిగిపోవడం గమనార్హం.
ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (ట్విట్టర్)లో @mdtanveer87 అనే యూజర్ షేర్ చేస్తూ.. "మెట్రో ఇప్పుడు ప్రయాణానికి కాకుండా స్టంట్లకు అడ్డాగా మారిపోయింది. ఒక యువకుడి పిచ్చి చేష్టల వల్ల మహిళా ప్రయాణికురాలు సీటు వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఇలాంటి వారిపై మెట్రో అధికారులు చర్యలు తీసుకోరా?" అంటూ ప్రశ్నించారు. కేవలం 23 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరిక ఉండొచ్చు కానీ, ఎదుటివారికి ఇబ్బంది కలిగించడం ఏమాత్రం సమర్థనీయం కాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
Reels का जुनून या सरेआम बदतमीजी?
— TANVEER (@mdtanveer87) February 20, 2026
Metro अब सफर के लिए कम और स्टंटबाजी के लिए ज्यादा जानी जाने लगी है।
इस वीडियो में देखिए कैसे एक युवक की रील बाजी और उछल-कूद की वजह से बगल में बैठी महिला को अपनी सीट छोड़कर वहां से भागना पड़ा।
क्या मेट्रो प्रशासन ऐसे लोगों पर लगाम लगाएगा? pic.twitter.com/VtlSWVJAiN
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "పబ్లిక్ ప్లేసుల్లో ఇలాంటి అసభ్యకర ప్రవర్తనను అస్సలు సహించకూడదు. మెట్రో అడ్మినిస్ట్రేషన్ వెంటనే ఆ యువకుడిని గుర్తించి భారీ జరిమానా విధించాలి" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, "వీళ్లకి పిచ్చి ముదిరిపోయింది, అమ్మాయిలు భయపడేలా ప్రవర్తించడం అంటే ఇది ముమ్మాటికీ బరితెగింపే" అని మరొకరు రాసుకొచ్చారు. మెట్రోలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిఘా పెంచాలని, అల్లరి మూకలపై కఠినంగా వ్యవహరించాలని అందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.