Raksha bandhan 2020: తోబుట్టువుల అనుబంధ సంబరం రక్షా బంధన్!

Raksha bandhan 2020: రాఖీ పండుగ సోదరీ సోదరుల అనుబంధాల వెల్లువ!

Update: 2020-07-31 14:17 GMT
Raksha bandhan 2020 (representational image)

అమ్మ తరువాత అమ్మలా ప్రేమను పంచుతుంది. అన్న కళ్ళలో నీళ్ళు చూస్తె చెల్లెలు గుండె చెమ్మగిల్లుతుంది. తమ్ముడి గొంతులో బాధ వింటే అక్క మనసు చివుక్కు మంటుంది. పేగు బంధంతో పెనవేసుకున్న అనుబంధం అది. కలిసి పెరిగిన సంబరంలోని సంబంధం అది.

అమ్మ పెట్టిన గోరుముద్దలు తింటూ ఒకరితో ఒకరు అమ్మ ప్రేమకోసం పోటీ పడినా.. నాన్న తెచ్చిన బట్టలు చూసుకుని నావి బావున్నాయంటే..నావి బావున్నాయంటూ గెంతులు వేసినా.. వెన్నెల వెలుగులో అక్క/చెల్లి గోరింటాకు పెట్టుకుంటుంటే నాకూ కావాలంటూ గారాబం చేసినా.. బడిలో తమ్ముడు/అన్న చేసిన అల్లరిని ఇంటికి వచ్చి చెబుతూ ఒకరితో ఒకరు గిల్లికజ్జాలు పెట్టుకున్నా.. పెద్దయ్యాకా పెళ్ళిచేసుకుని మెట్టినింటికి వెళుతున్న తోబుట్టువుల మధ్య కన్నీటిపొర తమ అనుబంధాలను ఆవిష్కరిస్తున్నా.. అన్నిటి మధ్య పెనవేసుకున్న సోదర సోదరీ బాంధవ్యానికి కొలమానం లేదు. మన సంస్కృతిలో ఇంటి ఆడపడుచుకు ఇచ్చే ప్రాధాన్యం లెక్కే వేరు. ఎక్కడ ఉన్నా..ఎలా ఉన్నా సోదరుడు సంతోషంగా ఉండాలని ఆశపడే సోదరి,.. నీ కష్టంలో రక్షనై ఉంటానని చెప్పే పండుగే రాఖీ పండుగ. తన తోబుట్టువు ఎక్కడున్నా ఆనందాల పందిరిలో చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ జరుపుకునే వేడుకే రాఖీ పండుగ. శ్రావణ మాసంలో పౌర్ణిమ రోజు సోదరి సోదరుల సంబంధానికి సోదరుని చేతికి కట్టే రక్ష.. జగతిలో ఆ బంధానికి ఇచ్చే భరోసా. ఒకరికి ఒకరం ఉన్నామంటూ అన్నచెల్లెల్లు చెప్పుకునే బాస.

అన్నకు చెల్లెలి రక్ష..చెల్లికి అన్న ఇచ్చే బాసట.. రెండిటినీ కలబోసి రాఖీపండుగ. సోదర ప్రేమలో ఉండే గాంభీర్యం..సోదరి ప్రేమలో ఉండే లాలిత్యం.. రెండిటినీ ఒకేసారి మననం చేసుకునే పండుగ రాఖీ..

ఒక్కరోజు హడావుడిగా వెళ్లి రాఖీ ఆడపడుచుతో రాఖీ కట్టించుకోవడంతో ఆగిపోయే బంధం కాదు సోదర బంధం. సోదరునికి సోదరి పట్ల ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేస్తుంది. సోదరికి సోదరుని పట్ల ఉన్న ప్రేమను ఎలా కాపాడుకోవాలో చెబుతుంది. కదిలిపోతున్న కాలంలో తరిగిపోతున్న అనుబంధాలను దారపు పోగుతో కలిపి ఉంచేలా చేసేది రాఖీ. వయసుతో పాటు పెరుగుతున్న బాధ్యతలతో వచ్చిన సంబంధ బాంధవ్యాల అంతరాలను పక్కకు నెట్టి సోదర బంధంలోని మాధుర్యాన్ని పంచుకోవడానికే రక్షా బంధన్.

తోబుట్టువును చివరి క్షణం వరకూ ప్రేమించమని.. సోదరుని క్షేమం కోసం నిత్యం ఆకాంక్షించమనీ.. చెబుతుంది. ఆగస్టు 3 సోమవారం రక్షా బంధన్ సందర్భంగా HMTV అందరికీ శుభాకాంక్షలు తెలుపుతోంది!  

Tags:    

Similar News