NT Rama Rao Death Anniversary: ఎన్టీఆర్ అది మూడక్షరాల పేరు కాదు.. అదో ప్రభంజనం..!

NT Rama Rao Death Anniversary: తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, అలనాటి హీరో ఎన్టీఆర్ 29వ వర్థంతి ఇవాళ.

Update: 2025-01-18 07:14 GMT

NT Rama Rao Death Anniversary: ఎన్టీఆర్ అది మూడక్షరాల పేరు కాదు.. అదో ప్రభంజనం..!

NT Rama Rao Death Anniversary: తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, అలనాటి హీరో ఎన్టీఆర్ 29వ వర్థంతి ఇవాళ. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన చేసిన సినిమాలు, రాజకీయ నేతగా ఎన్టీఆర్ చేసిన సేవలను తెలుసుకుందాం.

నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామ్మమ్మ దంపతులకు జన్మించారు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. పాఠశాల విద్యా విజయవాడ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో చేరాడు.

1942లో మే నెలలో 20 ఏళ్ల వయసులోనే మేనమామ కుమార్తె బసవ తారకాన్ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్న సమయంలో నాటక సంఘాల కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం కె.వి.ఎస్. శర్మ తదితరులతో ఎన్నో నాటకాలు చేశారు. తర్వాత కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది.

రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం, పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఎన్టీఆర్ ను తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకుంటారు. తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషల్లో కలిపి దాదాపు 303 చిత్రాల్లో ఎన్టీఆర్ నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలలో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు.

రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి.. అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు.

సినిమాల్లో, రాజకీయాల్లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నారు నందమూరి తారక రామారావు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ రేర్ రికార్డు క్రియేట్ చేశారు. అప్పట్లోనే 50వ దశకంలో పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, హిందీలో చండీరాణి సినిమా చేశారు. అది కూడా భానుమతి దర్శకత్వంలోనే. అంతేకాదు నయా ఆద్మీ అనే బాలీవుడ్ సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో సంతోషం పేరుతో తెరకెక్కింది. 1977 ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన దాన వీర శూర కర్ణ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే ఏడాది రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలిసారి ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అదే ఏడాది తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన యమగోల మూడో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అసలు ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటిది ఒకే సంవత్సరం మూడు చిత్రాలు ఒక దాన్ని మించి మరొకటి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం అనేది అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది.

సినిమాల్లో, రాజకీయాల్లో ఆయన రాణించారు. సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్‌తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. పొలిటికల్ లీడర్‌గా తెలుగు గడ్డపై సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఎన్టీఆర్ సినిమాలో రికార్డులను నెలకొల్పారు. అదే సమయంలో రాజకీయాల్లో అతి తక్కువ సమయంలో పెను సంచలనమే సృష్టించారు. 13 ఏళ్ల రాజకీయ జీవితంలో 3 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 1983, 1984, 1994 మూడేళ్లు ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుంది.

ఇక 1989 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష నేతగా నిలిచారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. తిరిగి 1994లో జరిగిన ఎన్నికల్లో మరోసారి 220 సీట్లతో విజయం సాధించారు. సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడిన కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచారు. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ప్రభుత్వ, పార్టీ విషయాల్లో జోక్యం పెరిగిందనే ప్రచారం కారణంగా పార్టీలో సంక్షోభం నెలకొంది. ఎన్టీఆర్ వైపు నుంచి చంద్రబాబు వైపు ఎమ్మెల్యేలు వచ్చారు. దీంతో ఎన్టీఆర్ సీఎం పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలో చంద్రబాబు సీఎం అయ్యారు. 1996 జనవరి 18న ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారు.

Tags:    

Similar News