Viral Video: వయసులోనే బుడ్డోడు.. కానీ దేశభక్తిలో చాలా పెద్దోడు..

Update: 2025-02-05 13:12 GMT

Viral Video: దేశభక్తి ఉండాలని చిన్నప్పటి నుంచి మనకు పెద్దలు, గురువులు చెబుతుంటారు. దేశభక్తి ఉండడం దేశంలో నివసించే ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా ఉండాల్సిన భాద్యత. అయితే కొంత మంది ఆ బాధ్యతను అంతగా పట్టించుకోరు. నిజానికి జాతీయ జెండా కనిపించినా, జాతీయ గీతం వినిపించినా వెంటనే అలర్ట్‌ అవ్వాలి. కానీ పెద్దగా పట్టించుకోరు. అయితే ఓ బుడ్డోడు మాత్రం తాను చేసిన పనితో అందరినీ ఫిదా చేశాడు.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన సాత్విక్ అనే కుర్రాడు స్థానికంగా ఉన్న పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. ఇటీవల స్కూల్‌ సమయం ముగియగానే ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో జాతీయ గీతం వినిపించింది. దీంతో ఒక్కసారి అలర్ట్‌ అయిన కుర్రాడు రోడ్డుపై అలాగే ఉండిపోయాడు.

జాతీయ గీతం పూర్తయ్యే వరకు అక్కడి నుంచి అడుగు కూడా ముందుకు వేయలేదు. గీతం ముగిసిన వెంటనే 'జై హింద్‌' అంటూ సెల్యూట్‌ చేశాడు. దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇంకేముంది ఈ వీడియో కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. బుడ్డోడి దేశ భక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ చిన్నారిని చూసి మనం కచ్చితంగా నేర్చుకోవాలని కొందరు కామెంట్స్‌ చేస్తుంటే, మరికొందరు స్పందిస్తూ ఈ కుర్రాడు వయసులోనే చిన్నోడు సంస్కారంలో మాత్రం చాలా పెద్దోడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News