అసలు కశ్మీర్‌ లోయలో ఏం జరుగుతుంది..?

Update: 2019-08-03 14:28 GMT

కశ్మీర్‌ నివురుగప్పిన నిప్పులా కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం వెంటాడుతోంది. లోయలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఏకంగా 38 వేల మంది సైనికులు మోహరించడంతో.. ప్రజలతో పాటు.. రాజకీయ నాయకులూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోనవసరం లేదని.. ఉగ్రదాడుల దృష్ట్యా.. బలగాలను తరలించారలని.. గవర్నర్‌ సత్యాపాల్ మాలిక్‌ స్పష్టం చేశారు.

 ఎప్పుడూ ఉగ్రదాడులతో అల్లకల్లోలంగా ఉండే కశ్మీరం.. ఈసారి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలియక.. మరింత వేడెక్కింది. సుమారుగా 38 వేల సాయుధ సైనికులను తరలించిన కేంద్రం.. అమర్‌నాథ్‌ యాత్రికులను వెనక్కి రావాల్సిందిగా కోరింది. అంతేకాకుండా.. శ్రీనగర్‌ నిట్‌ నుంచి విద్యార్థులను ఖాళీ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు, యాత్రికులతో పాటు.. పర్యాటకులు కూడా కశ్మీర్‌ నుంచి తిరిగివెళ్తున్నారు. దీంతో శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు.. ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది.

శ్రావణ పౌర్ణమి వరకు సాగే అమర్‌నాథ్‌ యాత్రతో పాటు.. సెప్టెంబర్‌ 5 వరకు కొనసాగే మచేల్‌ మాతా యాత్రను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. భద్రతా కారణాల వల్లే యాత్రలకు బ్రేక్ వేశామంటున్న ప్రభుత్వం.. జవాన్లకు సెలవులు రద్దు చేసింది. ఇటు కేంద్రం చర్యలతో తీవ్ర ఆందోళనలో పడ్డ కశ్మీరీలు.. నిత్యావసర వస్తులను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. ఏటీఎం కేంద్రాలు, సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌ బంకుల దగ్గర క్యూ కడుతున్నారు.

ఆర్టికల్ 35 ఏ ను రద్దు చేస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగడంతో పాటు.. తాజా నిర్ణయాలతో.. కశ్మీరీ ప్రజలతో పాటు.. రాజకీయ నాయకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అసలు రాష్ట్రంలో ఏం జరగబోతోంది..? కేంద్రం నుంచి ఎలాంటి నిర్ణ‍యం వెలువడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటు గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌తో.. మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా సమావేశం అయ్యారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో కాశ్మీరీలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని.. కాశ్మీర్ పై కేంద్రం వైఖరి.. పార్లమెంట్ సాక్షిగా వెల్లడించాలని.. డిమాండ్ చేశారు.

గత నాలుగేళ్లలో కశ్మీర్‌లో పరిస్థితులు దిగజారాయని.. రాష్ట్ర ప్రజల ప్రాణాలకు ప్రమాదం వచ్చిందని.. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు గులాంనబీ ఆజాద్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఆగస్టు 15 న కాశ్మీర్ లోని అన్ని ప్రాంతాల్లో మువ్వన్నెల జెండాలు ఎగరేయాలని.. కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు సన్నాహకంగానే.. పెద్ద ఎత్తున బలగాల మోహరించారు. అందులో భాగంగానే.. అమర్‌నాథ్ యాత్రను నిలిపేశారని చెబుతున్నారు. మరోవైపు జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్ స్పందించారు. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని.. కశ్మీరీ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్న కారణంగానే.. భారీగా కేంద్ర బలగాలను మోహరించారని.. రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని కోరారు.

  

Tags:    

Similar News