ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Update: 2019-07-30 13:30 GMT

ట్రిపుల్ తలాక్‌ బిల్లు విషయంలో బీజేపీ ప్రభుత్వం తన పతం నెగ్గించుకుంది. ఎప్పటి నుంచో బిల్లు ఆమోదం కోసం ఎదురుచూస్తున్న మోడీ సర్కార్‌ కలనెరవేరింది. ఎట్టకేలకు రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభించింది. కొన్ని పార్టీలు దీనిని వ్యతిరేకించినా మెజార్టీ సభ్యుల ఓట్లతో బిల్ పాస్ అయ్యింది.

బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేశారు. పలువురు సభ్యులు సభకు గైర్హాజరు కావడంతో మ్యాజిక్‌ ఫిగర్‌ అనూహ్యంగా తగ్గింది. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఓటేయగా వ్యతిరేకంగా 84 మంది సభ్యులు ఓటు వేశారు. బీజేపీ సొంత సభ్యులు ఉండగా మిత్రపక్షాల మద్దతుతో బిల్లుకు ఆమోదం లభించింది.

పలువురు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండడంతో మ్యాజిక్‌ ఫిగర్‌ తగ్గడంతో బిల్లు సునాయంగా ఆమోదం పొందింది. సభ్యులందరికి స్లిప్పులు పంచి రహస్య ఓటింగ్‌ పద్దతిలో బిల్లుపై అభిప్రాయం తీసుకున్నారు. అనంతరం మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారని సభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

జేడీయూ, అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్‌ చేయగా టీడీపీ, టీఆర్‌ఎస్‌ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బిల్లుకు బీజేడీ మద్దతిచ్చింది. ఇది వరకే రెండుసార్లు రాజ్యసభలో బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి బిల్లును నెగ్గించుకునేందుకు బీజేపీ ప్రత్యేక వ్యూహాలను రచించింది. అంతకుముందు బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనలకు సభ చైర్మన్‌ ఓటింగ్‌ చేపట్టారు. మూజువాణి పద్దతిలో ఓటింగ్‌ను నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 84 మంది ఓటువేయగా వ్యతిరేకంగా 100 మంది సభ్యులు ఓటువేశారు. దీంతో సవరణలకు విపక్షాలు చేసిన తీర్మానం వీగిపోయింది.

పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదమే మిగులుంది. సుమారు 9 కోట్ల మంది ముస్లిం మహిళలకు ఈ బిల్లు ద్వారా ఊరట లభించనుంది. 

Tags:    

Similar News