Toll Plaza: ఆర్థరాత్రి నుంచి పెరగనున్న టోల్‌ప్లాజా చార్జీలు.. ఎంతంటే?
Toll Plaza: గత సంవత్సరం 8 శాతం నుంచి 15 శాతం పెరిగిన చార్జీలు
Toll Plaza: ఆర్థరాత్రి నుంచి పెరగనున్న టోల్‌ప్లాజా చార్జీలు
Toll Plaza: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో చార్జీల పెంపు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. రోడ్ల నిర్వహణకు సంబంధించి ఏటా ఏప్రిల్ ఒకటి నుంచి చార్జీల పెంపును ఆనవాయితీగా తీసుకున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ ఈసారి కూడా కొత్త చార్జీలను సిద్ధం చేసింది. గతేడాది వివిధ కేటగిరీల వాహనాలకు సంబంధించి 8 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచగా.. ఈసారి వాహనదారులపై కాస్త దయతలిచి 5.50 శాతంలోపే పెంపును పరిమితం చేసింది.
విజయవాడ రహదారిలోని పంతంగి టోల్ ప్లాజాను ఉదాహరణగా తీసుకుంటే.. గతేడాది కారు, జీపు, వ్యాన్ కేటగిరీలో చార్జీని 80 రూపాయల నుంచి 90 రూపాయలకు అంటే10 రూపాయలు పెంచింది. ఈసారి 90 రూపాయల నుంచి 95 రూపాయలకు పెరిగింది. అంటే 5 రూపాయలు మాత్రమే పెంచింది. ఇక గతేడాది టోల్ ధరలు అమల్లోకి వచ్చాక కొత్తగా ఐదు ప్రాంతాల్లో టోల్‌గేట్లు అందుబాటులోకి వచ్చాయి.
గత ఆర్థిక సంవత్సరంలో టోల్‌ప్లాజాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 18 వందల 20 కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా, ఈసారి దేశవ్యాప్తంగా మరిన్ని టోల్‌గేట్లు అందుబాటులోకి రావడం, ధరల పెంపు నేపథ్యంలో టోల్ వసూళ్లు రెండు వేల కోట్ల రూపాయలు దాటిపోతాయని అంచనా.
గతంలో టోల్‌గేట్ల వద్ద నిర్వాహకులు భారీగా అక్రమాలకు పాల్పడటంతో.. వాహనాల నుంచి వసూలు చేసిన మొత్తంలో దాదాపు 25 శాతం పక్కదారి పట్టేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనితో ప్రభుత్వ ఖజానాకు చేరే మొత్తం తక్కువగా కనిపించేది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక అక్రమాలకు తెరపడి, ప్రతి రూపాయి లెక్కలోకి వస్తోంది. దీనితో గత మూడేళ్లుగా టోల్ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి.