Shashikala Case : జైలు నుంచి శశికళ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం

Update: 2019-10-10 03:32 GMT

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నమ్మిన బంటుగా వ్యవహరించిన శశికళ కొంత కాలంగా బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఆమె మరో సంవత్సరంలో విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈ విడుదల మరికొంత ఆలస్యం కావచ్చనీ, ఆమె శిక్షాకాలం మరింత పొడిగించే అవకాశం ఉందనీ తెలుస్తోంది. జైల్లో నిబంధనలకు వ్యతిరేకంగా శశికళకు రాజభోగాలను ఏర్పాటు చేసినట్టు.. ఆమెకు ప్రత్యేకంగా వంటగది, బ్యారక్, ఫోన్ సౌకర్యాలను కల్పించారనీ వచ్చిన అభియోగాలపై విచారణ జరిపిన వినయ్ కుమార్ కమిటీ ఆధారాలను ప్రభుత్వానికి సమర్పించింది.

తనకు సౌకర్యాలు కల్పించినందుకు గానూ శశికళ జైలు అధికారి సత్యనారాయణకు శశికళ 2 కోట్ల వరకూ ముడుపులు ఇచ్చారని ఈ నివేదిక పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీంతో శశికళ జైలు శిక్ష మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిన్న బెంగళూరు నగర క్రైమ్ పోలీసులు, అసిస్టెంట్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలో పరప్పన అగ్రహార జైల్లో ఆకస్మిక తనిఖీలు జరుపగా, పలువురు ఖైదీల వద్ద నుంచి గంజాయితో పాటు సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి. శశికళ గదిలోనూ ఈ తనిఖీలు జరుగగా, ఆమె వద్ద ఎటువంటి నిషేధిత వస్తువులూ లభించలేదని తెలుస్తోంది. కాగా, జైల్లో శశికళ అనుభవిస్తున్న రాజభోగాలపై తొలిసారి జైళ్ల శాఖ డీజీపీ  రూప నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. అప్పట్లో శశికళ, జైల్లో దర్జాగా తిరుగుతున్న వీడియో దృశ్యాలు, బయటకు వెళ్లి వస్తున్న దృశ్యాలు బహిర్గతమై తీవ్ర కలకలం రేపాయి. ఈ కేసులో శశికళ మరో ఏడాదిలో తన జైలు శిక్షను ముగించుకోనుండగా, తాజా పరిణామాలతో ఆమె విడుదల ఆలస్యమవుతుందని సమాచారం.


Tags:    

Similar News