శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం

Update: 2020-01-15 05:05 GMT
శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం

శబరిమలకు భక్తజనులు పోటెత్తారు. కొండపై ఆవిష్కృతమయ్యే అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో శబరిమల కొండ శరణుఘోషతో మారుమ్రోగుతోంది.

శబరిమల అయ్యప్ప కొండపై అపురూప ఘట్టం ఆవిష్కృతంకానుంది. స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాములు చేసిన శరణుఘోషతో శబరిగిరులు మారుమ్రోగుతుండగా మకరజ్యోతి రూపంలో భక్తులకు అయ్యప్ప దర్శనమివ్వనున్నాడు. పొన్నాంబలమేడు కొండపై నుంచి భక్తులకు మకరజ్యోతి దివ్య దర్శనం జరగనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు లక్షలాదిగా అయ్యప్ప స్వాములు తరలివస్తున్నారు.

ఈ కీలక ఘట్టం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్‌టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనాన్ని చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం తిరువాభరణ ఘట్టం పూర్తయిన వెంటనే అయ్యప్పస్వామి పొన్నాంబలమేడు కొండమీద నుంచి మకరజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. పందళ రాజవంశీయులు స్వామిని దర్శించిన తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. మకరజ్యోతి దర్శనం ఉన్న నేపథ్యంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News