100 మంది పోలీసులు, 75 గంటలు, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్... ఆ నిందితుడిని ఎలా పట్టుకున్నారు?

Pune woman rape case accused Dattatray Ramdas Gade arrested: పూణె రేప్ కేసులో నిందితుడైన దత్తాత్రేయ రామ్‌దాస్ గాడెకు కోర్టు...

Update: 2025-03-01 01:30 GMT

100 మంది పోలీసులు, 75 గంటలు, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్... పూణె మహిళ రేప్ కేసులో నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు?

Full View

ఒక్క నిందితుడిని పట్టుకునేందుకు అనేక డ్రోన్ కెమెరాలు జిల్లా మొత్తం జల్లెడ పట్టాయి.

డాగ్ స్క్వాడ్ బృందాలు పూణె జిల్లాను దాటుకుని పొరుగునున్న జిల్లాలకు పరుగులు తీశాయి.

100 మంది పోలీసులతో 13 పోలీసు బృందాలు అదేపనిగా అనువణువూ గాలించాయి.

75 గంటలపాటు ఆ ఒక్క జిల్లానే కాదు... ఆ చుట్టుపక్కల జిల్లాల పోలీసులు కూడా హై అలర్ట్ అయ్యారు.

నిందితుడి ఫోటోలు రిలీజ్ చేసి మరీ సెర్చ్ ఆపరేషన్ చేశారు.

నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయల బహుమానం ఇస్తామని ప్రకటించారు.

ఎట్టకేలకు ఆ నిందితుడు పోలీసులకు దొరికాడు.

అత్యంత గట్టి భద్రత మధ్య పోలీసులు ఆ క్రిమినల్‌ను స్టేషన్‌కు తరలించారు.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది ఎవరి గురించో కాదు... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె రేప్ కేసులో ప్రధాన నిందితుడైన దత్తాత్రేయ రామ్‌దాస్ గాడె గురించే. పూణె పోలీసులు గాడెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, గాడెను అరెస్ట్ చేయడానికి ముందు పోలీసులు చేసిన 75 గంటల మ్యాన్‌హంట్ ఆపరేషన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

పూణెలోని ఒక బస్ డిపోలో బస్సులో 26 ఏళ్ల మహిళను రేప్ చేసిన కేసులో దత్తాత్రేయ గాడె నిందితుడిగా ఉన్నాడు. గాడెను పట్టుకునేందుకు పెద్ద సినిమాటిక్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. స్వార్‌గేట్ పోలీసు స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ అత్యాచారం జరిగింది. దీంతో పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే నేరాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందంటూ ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి.

నిందితుడిని పట్టుకుని శిక్షపడేలా చూడాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వంపై, పూణె పోలీసులపై ప్రజా సంఘాల నుండి ఒత్తిడి పెరిగింది.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఈ ఘటనపై స్పందించారు. ఎలాగైనా సరే నిందితుడిని పట్టుకుని అతడికి ఉరిశిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. అలా పూణె పోలీసులు ఈ కేసు దర్యాప్తును సవాలుగా తీసుకుని నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు.

ఇంతకీ ఎవరీ దత్తాత్రేయ రామ్‌దాస్ గాడె?

13 పోలీసు బృందాలు రంగంలోకి దిగినప్పటికీ దత్తాత్రేయ రామ్‌దాస్ గాడెను పట్టుకునేందుకు పోలీసులకు 3 రోజులకుపైనే సమయం పట్టింది. మరి పోలీసుల కళ్లుగప్పి ఆ 75 గంటలు గాడె ఎక్కడికి పారిపోయారు? ఎందుకు ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు అంతగా శ్రమించాల్సి వచ్చింది? అందుకు కారణం గాడె అప్పటికే నేరచరిత్ర ఉన్న ఒక హిస్టరీ షీటర్ కావడం.

ఔను... గాడెపై అర డజన్ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. చోరీలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్ సహా పలు ఇతర నేరాల్లో ఆయన నేరస్తుడు. పూణె, అహిల్య నగర్ జిల్లాల్లో పలు పోలీసు స్టేషన్లలో గాడెపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. అలా ఓ కేసులో జైలుకు వెళ్లి 2019 లో బెయిల్‌పై బయటికొచ్చాడు.

జైలుకు వెళ్లొచ్చినా గాడె తీరు మారలేదు. నేరాలు చేయడం ఆపలేదు. తాజాగా బస్సులో మహిళపై అత్యాచారం చేసి మరోసారి పోలీసు రికార్డ్సులోకి ఎక్కాడు. అందుకే ఇకనైనా గాడె నేరాలకు బ్రేకులు వేయాలనే లక్ష్యంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని మరీ వెతికారు. పూణెకు 100 కిమీ దూరంలోని గునత్ అనే గ్రామానికి చెందిన గాడెకు పెళ్లయి ఒక బాబు కూడా ఉన్నారు.

ఇంతకీ పోలీసులు గాడెను ఎలా పట్టుకున్నారు?

మంగళవారం తెల్లవారుజాము నుండే గాడె పరారీలో ఉన్నాడు. పరారవడానికి ముందే తాను పెద్ద తప్పు చేశాను. పోలీసులకు లొంగిపోతాను అని తన కుటుంబసభ్యులకు చెప్పాడు. కానీ ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గాడె కోసం 100 మంది పోలీసులు 13 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. పోలీసు జాగిలాలతో గాలింపు నడుస్తోంది.

గాడె కోసం వేట నడుస్తున్న సమయంలోనే గురువారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు పోలీసులకు ఒక సమాచారం అందింది. ఆయన తమ బంధువుల ఇంటికి వచ్చినట్లుగా తెలిసిందని స్వయంగా గాడె కుటుంబమే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే డాగ్ స్క్వాడ్ బృందం అక్కడికి పరుగులు తీసింది. నీళ్లు, భోజనం కోసం అక్కడికి వచ్చిన గాడె పోలీసులు రావడానికి ముందే నీళ్ల బాటిల్‌తో అక్కడి నుండి పరారయ్యాడు. కానీ వెళ్తూ వెళ్తూ ఒక క్లూ వదిలిపోయాడు.

సెంట్ వాసన వెనకే పరుగులు తీసిన పోలీసు జాగిలాలు

గాడె తమ బంధువల ఇంట్లో షర్ట్ మార్చుకుని వెళ్లిపోయాడు. అదే అతడు తనకు తెలియకుండానే విడిచిపెట్టిన క్లూ. పోలీసు జాగిలాలు ఆ షర్ట్‌పై ఉన్న సెంట్ వాసన వెనకాలే పరుగులు తీశాయి. గాడె సొంతూరైన గునత్ గ్రామ శివార్లలో ఉన్న చెరుకు తోటల్లోకి జాగిలాలు పరుగెత్తాయి. వాటి వెంటే పోలీసులు పరుగెత్తారు.

చెరుకు తోట మధ్య నీళ్ల కాలువలో దాక్కున్న దత్తాత్రేయ రామ్‌దాస్ గాడెను జాగిలాలు గుర్తించాయి. అప్పటికే గురువారం అర్ధరాత్రి దాటి ఒంటి గంట30 నిమిషాలు అవుతోంది. అలా పోలీసులు గాడెను ప్రాణాలతో పట్టుకుని పూణెకు తీసుకొచ్చారు.

ఆరోజు ఏం జరిగింది?

మంగళవారం ఉదయం సమయం 5 గంటల 45 నిమిషాలవుతోంది. పూణెలో రద్దీగా ఉండే స్వార్‌గేట్ బస్ స్టేషన్ అది. సిటీలోనే ఒక ఆస్పత్రిలో ప్రీఆపరేటివ్ కౌన్సిలర్‌గా పనిచేస్తోన్న ఒక మహిళ సతర జిల్లాలోని ఫల్టాన్‌కు వెళ్లే బస్సుకోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడే గాడే ఆ మహిళ వద్దకు వెళ్లి అక్కా అని పిలుస్తూ తనను తను ఒక బస్ కండక్టర్‌గా పరిచేయం చేసుకున్నాడు.

ఫల్టన్ వెళ్లే బస్సు ఇక్కడ ఆగదని, అది మరో ప్లాట్‌ఫామ్ వద్ద ఆగుతుందని చెప్పి ఆమెను ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు. శివ్ షాహి ఏసీ బస్సు అక్కడికె వెళ్తుందని చెప్పి లోపలికి ఎక్కమన్నాడు. బస్సులో లైట్స్ ఆఫ్ చేసి ఉండటంతో ఆమె సందేహించారు. కానీ గాడె ఆమెను నమ్మించి లోపలికి ఎక్కేలా చేశాడు. ఆమె బస్సు ఎక్కడంతోనే వెనకాలె వెళ్లి ఆమెకు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన గురించి పోలీసులకు చెబితే పరిస్థితి మరోలా ఉంటుందని బాధితురాలిని బెదిరించాడు. ఈ ఘటన జరిగిన తరువాత ఉదయం 10 గంటల ప్రాంతంలో స్వార్‌గేట్ బస్ స్టేషన్ అధికారుల ద్వారా ఈ దారుణం వెలుగులోకొచ్చింది.

రాజకీయాలపై గాడె ఆసక్తి

దత్తాత్రేయ గాడెకు నేర చరిత్రే కాదు... రాజకీయాలపై కూడా ఆసక్తి ఉంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఒకరిద్దరు నాయకుల వెంట ఎన్నికల ప్రచారంలో తిరిగారు. వారితో కలిసి ఫోటోలు తీసుకున్నారు.

అలా ఎన్సీపీ ఎమ్మెల్యే మౌళి కట్కెతో కలిసి తీసుకున్న ఫోటో పూణె మహిళ రేప్ కేసు తరువాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్సీపీకే చెందిన మరో మాజీ ఎమ్మెల్యే అశోక్ పవార్ కు అభినందనలు తెలియజేస్తూ మరో బ్యానర్ ఫోటో కూడా వైరల్ అయింది. దీంతో గాడెకు రాజకీయ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ ఇద్దరు నాయకులు కూడా గాడెతో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.

రాజకీయాల్లో ఉన్న వాళ్లు జనం మధ్యలోకి వెళ్లినప్పుడు ఎవరెవరితోనో ఫోటోలు దిగాల్సి వస్తుంది. అంతమాత్రాన్నే తమతో వారికి సంబంధాలు ఉన్నాయంటే ఎలా అని ప్రశ్నిస్తూ ఆ ఇద్దరూ పక్కకు తప్పుకున్నారు. అంతేకాదు... గాడెను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.

23 మంది సెక్యురిటీ గార్డ్స్ సస్పెన్షన్

ఈ ఘటన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఆర్టీసీ బస్ డిపోల్లో రక్షణ చర్యలపై సమీక్షకు ఆదేశించారు. సీసీటీవీ కెమెరాలు పెంచాల్సిందిగా సూచించారు.

అనధికారిక వాహనాలు, సీజ్ అయిన వాహనాలను ఏప్రిల్ 15 లోగా బస్సు స్టేషన్ల నుండి క్లియర్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాలతో 23 మంది సెక్యురిటీ గార్డ్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ప్రతాప్ ప్రకటించారు.

నిందితుడు అరెస్ట్ అవడానికి ముందుగా సూసైడ్ చేసుకునేందుకు యత్నించినట్లుగా తెలిసిందని పూణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ మీడియాకు తెలిపారు.

నిందితుడిని పోలీసులు పూణె కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వాదనల సందర్భంగా నిందితుడి తరుపు లాయర్లు మాట్లాడుతూ.. ఇది అత్యాచారం కాదని, మహిళ అంగీకారంతోనే జరిగిందని ఒక లాయర్ అన్నారు. అంతేకాదు... "ఒకవేళ గాడె బలవంతం చేసినట్లయితే ఆమె అరిచి గట్టిగా కేకలు వేసి ఉండొచ్చు కానీ ఈ ఘటనలో అలా జరగలేదు" అని మరో లాయర్ వాదించారు. మొత్తానికి గాడెకు పూణె కోర్టు రిమాండ్ విధించింది. పూణేలో మహిళ అత్యాచారానికి గురైనప్పటి నుండి నిందితుడు గాడెను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్ట్ రిమాండ్ విధించే వరకు జరిగిన వరుస పరిణామాల క్రమం ఇది. 

Tags:    

Similar News