TOP 6 NEWS @ 6PM: నాగబాబు మంత్రి పదవికి ముందడుగు

Update: 2025-03-05 12:30 GMT

నాగబాబు మంత్రి పదవికి ముందడుగు

1) ప్రతిపక్ష హోదాపై జగన్‌కు ఆ నిబంధన గురించి తెలియదా? - మంత్రి నారా లోకేశ్

పవన్ కళ్యాణ్‌కు వచ్చిన మెజారిటీ ఎంత, జగన్‌కు వచ్చిన మెజారిటీ ఎంత? అలాంటి సీఎం గురించి, డిప్యూటీ సీఎం గురించి జగన్ ఎందుకు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా రావలంటే సభలో కనీసం 10 సభ్యులు ఉండాలి. అది కనీస నిబంధన. కానీ వైఎస్సార్సీపీ 11 సీట్లే గెలుచుకుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలే నిర్ణయించుకున్నారు. ఆ విషయం జగన్ ఎందుకు గ్రహించడం లేదని లోకేశ్ అన్నారు. ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ఆ హోదా కోసం ముఖ్యమంత్రిని కించపరిచేలా జగన్ ఎందుకు మాట్లాడుతున్నారని లోకేశ్ ప్రశ్నించారు.

ఆయనకు చట్టాలను ఉల్లంఘించడం అలవాటే కాబట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా చట్టాలు ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందిగా పట్టుబడుతున్నారని లోకేశ్ అభిప్రాయపడ్డారు. అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అచ్చం జగన్ లానే ఉంటుందని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా, అధికారం లేకున్నా ఆయన జనాలకు దూరంగానే ఉంటున్నారన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మంత్రి నారా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2) ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు... ఆ తరువాత కేబినెట్లోకి

నాగబాబును ఏపీ కేబినెట్లోకి తీసుకునేందుకు ముందడుగు పడింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఆయన్ను శాసన మండలికి పంపించేందుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. గతంలో ఆయన్ను రాజ్యసభకు పంపించనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండు తెలుగు దేశం పార్టీకి మరో స్థానాన్ని బీజేపికి కేటాయించారు. నాగబాబును కేబినెట్లోకి తీసుకునే ఆలోచనతో ఉన్నట్లు అప్పట్లోనే చంద్రబాబు ప్రకటించారు. అందుకే ఆయన్ను రాజ్యసభకు కాకుండా శాసనమండలిలోకి తీసుకుంటున్నారు.

నాగబాబుకు కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ జనసేనలో కీలకంగా వ్యవహరించిన సోదరుడు నాగబాబును మంత్రిగా చూడాలన్న పవన్ కల్యాణ్ కోరికకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

3) తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్

కులగణనపై అభ్యంతరాలు ఉంటే శాసన మండలిలో మాట్లాడొచ్చు అని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ చేయని పనిని తాము చేస్తే అందుకు అభినందించాల్సిందిపోయి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. కొంతమంది నేతలు బీఆర్ఎస్, బీజేపి గొంతుకల్లా మాట్లాడుతున్నారని సీతక్క వ్యాఖ్యానించారు. కులగణన జరిగిన తీరు సరిగ్గా లేదని తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

4) Artificial Intelligence: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఒకటో తరగతి నుంచే ఏఐ పాఠాలు

Artificial Intelligence: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచే ఏఐపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 9వ తరగతి వరకు గణితంలో ఒక పాఠంగా ఏఏఐని చేర్చేందుకు చర్యలు చేపట్టింది. 1నుంచి 5 తరగతుల వరకు 2 నుంచి 3 పేజీల్లో ఆరు నుంచి 9వ తరగతి వరకు 4నుంచి 5 పేజీల్లో ఏఐ పాఠ్యాంశం ఉండనుంది. పాఠశాల విద్యాశాఖలోని ఓ అదనపు సంచాలకుడు, ఎస్ సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులతో ఏఐ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. ఇది సిద్ధమయ్యేందుకు 15-20 రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు.

కంప్యూటర్, ఏఐ పుట్టుపూర్వోత్తరాలు, ప్రస్తుతం ఎక్కడ వినియోగిస్తున్నారు కొన్ని ఉదాహరణలు చేర్చనున్నారు. సీబీఎస్ఈలో దాదాపు 4ఏళ్లక్రితమే 6వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఏఐ పాఠాలు చేర్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

5) ICC ODI Rankings: 143 మంది బౌలర్లను ఓడించిన వరుణ్ చక్రవర్తి

ICC ODI Rankings: వరుణ్ చక్రవర్తి ఆర్కిటెక్చర్ చదివాడు. తన చదువుకు తగ్గట్లే రోజు రోజుకు తను క్రికెట్ మైదానంలో విజయ శిఖరాన్ని నిర్మిస్తున్నాడు. ఐసిసి కూడా అతడి సామర్థ్యాన్ని గుర్తించింది. ఐసీసీ తాజా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని 143 మంది బౌలర్లను అధిగమించి భారత స్పిన్నర్ సంచలనం సృష్టించాడు. ఈ కుడిచేతి వాటం స్పిన్నర్ ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్నాడు.. అక్కడ తనకు లభించిన రెండు ఛాన్సులలో చాలా వికెట్లు తీశాడు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో వరుణ్ చక్రవర్తి 7 వికెట్లు పడగొట్టాడు. ఈ 7 వికెట్లలో 5 వికెట్లు ఒకే మ్యాచ్‌లోనే తీశాడు. దీనితో అతను టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కూడా చేరాడు. ఇప్పుడు న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ, మహమ్మద్ షమీ మాత్రమే అతని కంటే ఎక్కువ వికెట్లు తీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) ఏప్రిల్ 2 నుండి భారత్‌పై భారీ సుంకం

ఏప్రిల్ 2 నుండి భారత్‌పై కూడా అమెరికా భారీ సుంకం విధించేందుకు సిద్ధమైంది. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టార్‌లో భారత్ అమెరికాపై 100 శాతం పన్ను విధిస్తోందని ట్రంప్ అన్నారు. అమెరికా పట్ల భారత్ వైఖరి సరిగ్గా లేదని చెబుతూ ముందు నుండీ భారత్ ఇంతేనని అన్నారు. అందుకే ఏప్రిల్ 2 నుండి అమెరికాపై భారత్ ఎంత ట్యాక్స్ విధిస్తే అమెరికా కూడా అంతే టాక్స్ విధిస్తుందన్నారు.

ఒకవేళ అమెరికా ఉత్పత్తులు ఏవైనా భారత్ మార్కెట్లో లేకుండా అడ్డుకునేందుకు ఏమైనా నాన్-మానిటరీ ట్యాక్సులు విధిస్తే అమెరికా కూడా అదే పని చేస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా కాంగ్రెస్‌లో మంగళవారం ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇకపై అమెరికాతో వాణిజ్యంలో విషయంలో ఇబ్బందులు తప్పవా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

Tags:    

Similar News