నేడు అఖిలపక్ష నేతలతో ప్రధాని భేటి

Update: 2019-06-19 06:26 GMT

వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంస్కరణల దిశగా తొలి అడుగు వేసింది. ఒకే దేశం - ఒకేసారి ఎన్నిక నినాదాన్ని గతంలోనే వినిపించిన ఆ పార్టీ తాజాగా .... మరో అడుగు ముందుకు వేసింది. ఈ ప్రతిపాదనపై చర్చించేందుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. దేశంలోని ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలతో నేడు భేటి కానున్నారు. దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ భేటిలో ప్రధాని వెల్లడించనున్నారు. ఇదే సమయంలో వివిధ పార్టీల అధినేతలు వెల్లడించే అభిప్రాయలను కూడా తెలుసుకోనున్నారు. భేటిలో వ్యక్తమయ్యే అభిప్రాయాల ఆధారంగానే తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశాలున్నాయి.

పలు ప్రాంతీయ పార్టీలు దూరం..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశానికి పలు ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉండనున్నాయి. డీఎంకే, ఆమ్‌ ఆద్మీ, తృణముల్ కాంగ్రెస్‌, టీడీపీ పక్షాలు హాజరుకాబోమని తేల్చి చెప్పేశాయి. ఇదే సమయంలో యూపీఏ పక్షాల్లోని ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్రధాన మంత్రి చర్చించనున్న వన్ నేషన్‌ వన్ టైం ఎలక్షన్ బీజేపీ మేనిఫేస్టో అంశం కాబట్టి దూరంగా ఉండాలని యూపీఏలోని మెజార్టీ పార్టీలు భావిస్తున్నాయి. అయితే కేవలం చర్చకే పరిమితమవుతున్నందున హజరు కావాలని కొన్ని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నట్టు సమచారం.

ఎన్డీయే పక్షాల బాసట..

యూపీఏ పక్షాల్లో అభిప్రాయ భేదాలు వ్యక్తమయినా .. ఎన్‌డీఏలోని పక్షాలు మాత్రం ఏకతాటిపై నిలిచాయి. ప్రధాని మంత్రి నిర్వహించే సమావేశానికి హజరుకావాలని నిర్ణయించాయి. ఇదే సమయంలో తటస్ధులుగా ఉన్న వైసీపీ, టీఆర్ఎస్‌, బీజేడీ వంటి పార్టీలు తాము సమావేశానికి హాజరవుతామంటూ ప్రకటించాయి. టీఆర్ఎస్ నుంచి కేటీఆర్‌, వైసీపీ నుంచి జగన్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 

Tags:    

Similar News