మహారాష్ట్రలో పడగ విప్పిన కరోనా.. కరోనాతో మరెన్నో సమస్యలు

Update: 2020-03-27 05:15 GMT

మహారాష్ట్ర లో కరోనా రోజురోజుకూ ఉధృతమవుతోంది. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మరో వైపున ఇతర సమస్యలూ మహారాష్ట్రనూ చుట్టుముట్టాయి.

ఒకవైపున ముంబై నగరం కరోనా కోరల్లో చిక్కుకుంది. మరో వైపున లాక్ డౌన్ తో రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇ-కామర్స్ డెలివరీలు కష్టమైపోయాయి. లాక్ డౌన్ సందర్భంగా ఆంక్షలను అమలు చేస్తున్న పోలీసులపై దాడులు జరుగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి, రెండు చోట్ల వైద్య సిబ్బందిపై కూడా దాడులు జరిగాయి. సైన్యాన్ని రప్పించాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కరోనా మహహ్మారి క్రమంగా ఆర్థిక విపత్తుగా మారుతోంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలో కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ కారణంగా సాధారణ రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. కిరాణా దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమతించి, తమ కార్యకలాపాలను మాత్రం పోలీసులు అడ్డుకోవడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ కు తాము పనులు ప్రారంభించకపోతే పంటలు ఎలా పండుతాయని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయం గనుక దెబ్బ తింటే రైతులకు వేల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరో వైపున కూరగాయలు, పండ్ల ను నగరాలకు తరలించడంలో కూడా వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కర్ఫ్యూ కారణంగా ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలకు నిత్యావసరాలు అందించడంలో ఇకామర్స్ సంస్థలు కీలకపాత్ర వహించే అవకాశం ఉంది. అయితే, డెలివరీ బాయ్స్ పై పోలీసులు కఠినంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో పలు నగరాల్లో ఇకామర్స్ సంస్థల డెలివరీలు ఆగిపోతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ సంస్థలు కోరుతున్నాయి. పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా ఇ కామర్స్ సంస్థలు సకాలంలో డెలివరీలు అందించలేకపోయాయి. దాంతో దేశవ్యాప్తంగా అవి 15 వేల లీటర్ల పాలు నేలపాలు చేశాయి. పదివేల కిలోల కూరగాయలను మట్టిపాలు చేశాయి. ఈ విధమైన సంఘటనలు మహారాష్ట్రలోనూ జరిగాయి. వెల్లువెత్తిన నిరసనలతో మహారాష్ట్ర పోలీసులు దిగివచ్చారు. డెలివరీ బాయ్ లకు పాస్ లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

మహారాష్ట్రలో మారుమూల ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారంతా నగరాల్లో బతకలేక గ్రామాలకు తిరుగుముఖం పట్టారు. రవాణా సదుపాయాలు లేకపోవడంతో కాలిబాట పడుతున్నారు. మరో వైపున ఫేక్ న్యూస్ తో వదంతులు అధికమైపోతున్నాయి. ఇలాంటివన్నీ కూడా కరోనా కు తోడుగా మరెన్నో సమస్యలను సృష్టిస్తున్నాయి.


Tags:    

Similar News