మలుపులు తిరుగుతున్న మహా రాజకీయం.. మరికాసేపట్లో సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేసే అవకాశం?

Update: 2019-11-26 10:01 GMT

మహారాష్ట్రలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. రేపు విశ్వాస పరీక్ష నేపధ్యంలో పరిణామాలు క్షణానికో రకంగా మారుతున్నాయి. డిప్యూటీసీఎం పదవికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేశారు.. ఎన్సీపీ సీనియర్ నేతలు అజిత్ పవార్ కు నచ్చ చెప్పడంతో ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీల ఎత్తుగడలు రకరకాలుగా మారుతుండటంతో ఎటూ నిర్ణయించుకోలేని డోలాయమాన స్థితిలోఆయనున్నారు.

ఎన్సీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు.. ఆయన్ను తిరిగి తీసుకునేందుకు వీలుగానే ఆయన్ను పార్టీ నుంచి శరద్ పవార్ సస్పెండ్ చేయలేదని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్ల కారణంగా అజిత్ పవార్ బలపరీక్షకు ముందే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.. శరద్ పవార్ భార్య రంగంలోకి దిగి అజిత్ పవార్ ను ఒప్పించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సీఎం పదవికి ఫడ్నవిస్ కూడా రాజీనామా చేయవచ్చన్న ఊహాగానలు వినిపిస్తున్నాయి. రేపటి బల పరీక్షకు అసెంబ్లీలోనే సీనియర్ నేత అయిన బాలాసాహెబ్ తోరట్ ను ప్రోటెం స్పీకర్ గా నియమించారు. రేపు సాయంత్రం 5 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సి ఉంది.

మహారాష్ట్ర రాజకీయాలలో మార్పులపై బీజేపీ అప్రమత్తమైంది. ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. జరుగుతున్న పరిణామాలను విశ్లేషించడమే కాదు.. రేపు అసెంబ్లీలోఅనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చలుజరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ వర్గాలు మాత్రం రేపు ఏర్పడబోయేది తమ ప్రభుత్వమేనని ధీమాగా చెబుతున్నాయి.

నిన్న 162 మంది ఎమ్మెల్యేలతో శరద్ పవార్, కాంగ్రెస్, శివసేన గవర్నర్ ముందు పెరేడ్ నిర్వహించడంతో బీజేపీ ఓటమి ఖాయమన్న అంచనాలు కనిపించాయి.. బలనిరూపణకు తగినంత సంఖ్యా బలం లేనందున ఫడ్నవిస్ ముందే రాజీనామా చేస్తున్నారన్నది ప్రత్యర్ధుల కామెంట్.. మరోవైపు ఈ సాయంత్రం ఎన్సీపీ, కాంగ్రెస్,శివసేన సమావేశమవుతున్నాయి. 

Tags:    

Similar News