Lottery Ticket: కోటి రూపాయల లాటరీ కొడితే కిడ్నాప్ చేశారు: కేరళలో వింత ఘటన.. అసలేం జరిగిందంటే?

Lottery Ticket: లాటరీ రూపంలో అదృష్టం కోటి రూపాయలు తెచ్చిపెట్టినా, ఆ వ్యక్తి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం అతడిని కిడ్నాపర్ల చేతికి చిక్కేలా చేసింది.

Update: 2026-01-16 04:49 GMT

Lottery Ticket: లాటరీ రూపంలో అదృష్టం కోటి రూపాయలు తెచ్చిపెట్టినా, ఆ వ్యక్తి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం అతడిని కిడ్నాపర్ల చేతికి చిక్కేలా చేసింది. ట్యాక్స్ కట్టడం ఇష్టం లేక, బ్లాక్ మార్కెట్‌లో టికెట్ అమ్మజూపిన బాధితుడు, చివరకు ప్రాణభయంతో ఆ టికెట్‌ను ముఠాకు సమర్పించుకోవాల్సి వచ్చింది.

అసలు ఏం జరిగింది?

కేరళలోని పెరవూర్‌కు చెందిన సాధిక్ ఏకే (46) అనే వ్యక్తికి డిసెంబర్ 30న నిర్వహించిన 'స్త్రీ శక్తి' లాటరీలో కోటి రూపాయల ప్రైజ్ మనీ తగిలింది. సాధారణంగా లాటరీ గెలిస్తే ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ట్యాక్స్ పోగా వచ్చే మొత్తం తక్కువగా ఉంటుందని, పైగా ఆ డబ్బు చేతికి అందడానికి సమయం పడుతుందని భావించిన సాధిక్, ఆ టికెట్‌ను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.

టికెట్ కోసం కిడ్నాప్ స్కెచ్

తన స్నేహితుడి సలహా మేరకు ఒక గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో టికెట్ ఇచ్చి నగదు తీసుకోవడానికి సాధిక్ తన స్నేహితుడితో కలిసి మంథాన ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడకు కారులో వచ్చిన దుండగుల ముఠా, నగదు ఇచ్చే నెపంతో వీరిద్దరినీ కారులోకి లాక్కెళ్లి అపహరించింది.

కొంత దూరం వెళ్లాక స్నేహితుడిని దించేసిన ముఠా, సాధిక్ వద్ద ఉన్న కోటి రూపాయల విలువైన లాటరీ టికెట్‌ను బలవంతంగా లాక్కుంది. అనంతరం రాత్రి 11:30 గంటల సమయంలో అతడిని నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టి పారిపోయింది.

ఒక్కరు అరెస్ట్.. మిగిలిన వారి కోసం గాలింపు

బాధితుడు వెంటనే పెరవూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. సాధిక్ ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, ముఠాలోని ఒక సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కిడ్నాప్, దోపిడీ కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Tags:    

Similar News