Sankranti Rooster Fights.. పంజా విసురుతున్న పుంజులు! రెండ్రోజుల్లోనే రూ. 1,000 కోట్లు హాంఫట్!

సంక్రాంతి కోడి పందేలు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్నాయి. రెండ్రోజుల్లోనే వెయ్యి కోట్లు చేతులు మారగా, తాడేపల్లిగూడెంలో రూ. 1.53 కోట్ల పందెం హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-01-16 06:49 GMT

సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలోని పల్లెల్లో 'కో.. అంటే కోడి పందెం' అన్నట్టుగా కాక రేపుతున్నాయి. పందెం రాయుళ్ల కేకలు, పుంజుల పంజాలతో బరుల దగ్గర పండుగ వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. నిన్న, ఇవాళ కలిపి కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 1,000 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా!

కోట్లు కుమ్మరిస్తున్న కోడి పందాలు

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పందేల జోరు కనిపిస్తోంది. సాధారణ పందేలే కాదు, కోట్లకు కోట్లు వెచ్చిస్తున్న పందేలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

రికార్డు పందెం: తాడేపల్లిగూడెం బరిలో ఏకంగా రూ. 1.53 కోట్ల భారీ పందెం జరిగింది. రాజమండ్రి రమేష్, గుడివాడ ప్రభాకర్ మధ్య జరిగిన ఈ పోరులో రాజమండ్రి రమేష్ పుంజు విజయం సాధించి రికార్డు సృష్టించింది.

ఖరీదైన గిఫ్టులు: గెలిచిన వారికి కేవలం నగదే కాదు.. ఖరీదైన బైకులు, కార్లను బహుమతులుగా ఇస్తుండడం విశేషం.

హైటెక్ బరులు.. కార్పొరేట్ ఈవెంట్లు!

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పందేల నిర్వహణ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇది కోడి పందెమా లేక కార్పొరేట్ ఈవెంటా అన్నట్టుగా ఉంది.

స్టేడియం సెటప్: పందేలను వీక్షించేందుకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

లైవ్ స్ట్రీమింగ్: ఏ కోడి గెలిచింది? ఏది ఓడింది? అని తెలుసుకోవడానికి పెద్ద పెద్ద స్క్రీన్లతో పాటు రివ్యూ సిస్టమ్ కూడా ఉంది.

బౌన్సర్ల పహారా: క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఏకంగా బౌన్సర్లను రంగంలోకి దించారు.

మద్యం పరవళ్లు.. మాంసాహార విందులు

బరుల దగ్గర కేవలం పందేలే కాదు, తిండికి కూడా తక్కువ లేదు. బరుల సమీపంలోనే ఘుమఘుమలాడే నాటుకోడి పులుసు, మాంసాహార విందులు నోరూరిస్తున్నాయి. మద్యం ఏరులై పారుతుండగా, పందెం రాయుళ్లు పందేల కాకలో మునిగిపోయారు.

ఎడ్ల పోటీలు.. గుర్రపు పందేలు

కోడి పందేలతో పాటు బండలాగుడు ఎడ్ల పోటీలు కూడా ఉత్సాహంగా సాగుతున్నాయి. బాపట్ల జిల్లాలో జరిగిన జాతీయస్థాయి పోటీలను సినీ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆసక్తిగా తిలకించారు. అనకాపల్లిలో జరిగిన గుర్రపు స్వారీ పోటీలు కూడా పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Tags:    

Similar News