ఏనుగును చంపిన వారి ఆచూకీ చెబితే.. భారీ బహుమతి..

Update: 2020-06-05 09:43 GMT

కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటనపై యావత్తు దేశం స్పందించింది. పటాసులు ఉన్న పైనాపిల్ తినిపించి గజరాజును చంపిన ఘటన చాలా మందిని కలవరానికి గురిచేసింది. మూగజీవాన్ని చంపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల నుంచి తీవ్రంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

కేరళలోని మల్లపురంలో ఆకలితో ఉన్న ఏనుగుకు పేలుడు పదార్థాలు కలిపిన పండును ఆహారంగా పెట్టారు కొందరు ఆకతాయిలు. నోట్లో పెట్టుకోగానే పండు పేలిపోవటంతో ఆ ఏనుగు నోటికి తీవ్ర గాయమైంది. బాధను తట్టుకోలేక నదిలో ఉండిపోయిన ఆ ఏనుగు చివరకు ప్రాణాలు విడిచింది

తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన కేరళ ఏనుగు మృతిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌‌గా తీసుకుంది. కేరళ ప్రభుత్వాన్ని పూర్తి నివేదిక అందించాలని ఆదేశించింది. అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. నిందితులను శిక్షించకుండా వదిలిపెట్టేది లేదన్నారు. పేలుడు పదార్థాలు ఆహారంగా ఇచ్చి జంతువులను హత్య చేయటం భారతీయ సంస్కృతి కాదన్నారు ప్రకాశ్‌ జవదేకర్‌. ఇక ఘటనపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్‌ అటవీ శాఖ అధికారులతో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తామన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు స్థానిక పోలీసులు.

ఏనుగు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. నిందితులను పట్టి ఇచ్చిన వారికి బహుమతి ఇస్తామని కొందరు ప్రకటిస్తున్నారు. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ ప్రాంతంలోని నివసించే శ్రీనివాస్‌ అనే వ్యక్తి నిందితులను పట్టిఇచ్చేవారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందిన ఘటనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర క్రికెటర్లు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగు మృతి చెందడం తమని తీవ్రంగా కలిచివేసిందని ట్విట్ చేశారు. ఓ ఏనుగు పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించడానికి వారికి మనసెలా వచ్చిందని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Full View


Tags:    

Similar News