ఈ నెల 18న 11 గంటలకు కర్ణాటకలో బలపరీక్ష

Update: 2019-07-15 10:27 GMT

కర్ణాటక సంకీర్ణ సర్కార్ భవితవ్యం ఈ నెల 18న తేలిపోనుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు బలపరీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో శాసనసభలో సంకీర్ణానికి సంఖ్యాబలం తగ్గిందని ఆరోపిస్తున్న భారతీయ జనతా పార్టీ.. నేడు ముఖ్యమంత్రి కుమారస్వామిపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన నోటీసును స్పీకర్‌కు సమర్పించింది.

తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బలపరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని గతవారం కుమారస్వామి శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. విశ్వాస పరీక్ష నేపథ్యంలో అటు సంకీర్ణ కూటమి, ఇటు బీజేపీ తమ తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించాయి. ఇవాళ ఉదయం ఆయా పార్టీల ఎమ్మెల్యేలు నేరుగా రిసార్టుల నుంచే శాసనసభకు చేరుకున్నారు. అనంతరం యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ను కలిసి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు సమర్పించారు.

అధికార పక్షం ఇచ్చిన విశ్వాస తీర్మానం, ప్రతిపక్షమిచ్చిన అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలో .. స్పీకర్ బల పరీక్షపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు బలపరీక్ష నిర్వహించనున్నారు. 

Tags:    

Similar News