కర్ణాటక సీఎం కుమారస్వామి వ్యూహాత్మక ప్రకటన .. అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధం

Update: 2019-07-12 11:45 GMT

తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ అటు అసమ్మతి ఎమ్మెల్యేలు... తనకు మరింత సమయం కావాలంటూ ఇటు స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించే ముందు వారి అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చా అన్నది నిర్ణయించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఈ కేసును మంగళవారానికి వాయిదా వేస్తూ... అప్పటి వరకు యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది.

రాజీనామాలపై యధాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్న కర్ణాటక కూటమి సర్కార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు కాంగ్రెస్ పార్టీ తరలించనుంది. అయితే అంతకు ముందు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి కుమారస్వామి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాజా పరిణామాల దృష్ట్యా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాని కుమారస్వామి తెలిపారు. అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమని ప్రకటించారు.

రాజకీయ సంక్షోభం చుట్టిముట్టిన సమయంలో సీఎం కుమారస్వామి వ్యూహాత్మక ప్రకటన చేశారు. బీజేపీ తేరుకోకముందే విశ్వాసాన్ని నిరూపించుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. స్పీకర్‌ సమయం ఎప్పుడు కేటాయిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News