ISRO PSLV-C62 Mission: అమెరికాకు కూడా సాధ్యం కాని 'అరుదైన' ఘనత.. నేడే PSLV-C62 ప్రయోగం!
ఇస్రో నేడు పీఎస్‌ఎల్‌వీ-సి62 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని ద్వారా అంతరిక్షంలో ఉపగ్రహాలకు ఇంధనం నింపే (రీఫ్యూలింగ్) అరుదైన సాంకేతికతను భారత్ ప్రదర్శించబోతోంది.
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో మహాత్కార్యానికి సిద్ధమైంది. నేడు శ్రీహరికోట నుంచి జరగబోయే PSLV-C62 ప్రయోగం కేవలం ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపడం మాత్రమే కాదు.. ప్రపంచ అగ్రరాజ్యాలకు సైతం సవాల్ విసిరే సరికొత్త సాంకేతికతను భారత్ సొంతం చేసుకోబోతోంది.
ప్రయోగ సమయం మరియు వేదిక:
ప్రయోగ వేదిక: సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (SHAR), శ్రీహరికోట.
సమయం: నేడు (సోమవారం) ఉదయం 10 గంటల 17 నిమిషాలకు.
రాకెట్: ఇస్రో నమ్మకమైన వాహకనౌక PSLV-C62.
ఏమిటి ఈ అరుదైన ఘనత?
ఈ మిషన్ ద్వారా భారత్ 'శాటిలైట్ రీఫ్యూలింగ్' (Satellite Refuelling) సాంకేతికతను ప్రదర్శించబోతోంది. అంటే అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాలకు గాలిలోనే ఇంధనాన్ని నింపడం అన్నమాట.
సాధారణంగా ఉపగ్రహాల్లో ఇంధనం అయిపోగానే వాటి కాలపరిమితి ముగిసిపోతుంది. కానీ ఈ 'రీఫ్యూలింగ్' టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, పాత ఉపగ్రహాలకు మళ్లీ ఇంధనం నింపి వాటి జీవితకాలాన్ని పెంచవచ్చు. దీనివల్ల వందల కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుంది.
అమెరికా కంటే ముందే భారత్!
ప్రస్తుతానికి ఈ సాంకేతికతను కేవలం చైనా మాత్రమే విజయవంతంగా ప్రదర్శించింది. అంతరిక్ష రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికా (NASA) మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఇప్పటికీ ఈ ప్రయోగాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేయలేకపోయాయి. నేటి ప్రయోగం సక్సెస్ అయితే, ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే రెండో దేశంగా భారత్ అవతరిస్తుంది.
2026కు అద్భుత ఆరంభం
2026 సంవత్సరంలో ఇస్రో చేపడుతున్న తొలి భారీ ప్రయోగం ఇదే. EOS N1 ఉపగ్రహంతో పాటు ఈ రీఫ్యూలింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ శాస్త్రవేత్తలకు ఎంతో కీలకం. ఈ ప్రయోగం విజయవంతమైతే గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో ఇస్రో స్థాయి మరింత పెరగడం ఖాయం.