ఎర్రకోట సాక్షిగా మోడీ సంచలన ప్రకటన..దేశ భద్రతపై అత్యంత కీలక నిర్ణయం

Update: 2019-08-15 12:28 GMT

ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. దేశ భద్రత విషయంలో రాజీలేదన్న మోడీ 73వ ఇండిపెండెన్స్‌-డే సందర్భంగా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రక్షణ కోసం సరికొత్త పదవిని సృష్టించిన మోడీ త్రివిధ దళాల సమన్వయం కోసం సింగిల్ ఇన్‌ఛార్జ్‌‌ను నియమించనున్నట్లు ప్రకటించారు.

దేశ రక్షణ విషయంలో రాజీలేదంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోట సాక్షిగా సంచలన ప్రకటన చేశారు. 73వ ఇండిపెండెన్స్‌-డే సందర్భంగా దేశ భద్రతపై అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రక్షణలో త్రివిధ దళాలు చూపుతోన్న తెగువను ప్రశంసించిన మోడీ మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా స్వల్ప మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. త్రివిధ దళాల సమన్వయం కోసం ఒక చీఫ్‌‌ను నియమించనున్నట్లు తెలిపారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా వ్యవహరించే సీడీఎస్‌ నియామకంతో సైనిక విభాగాల మధ్య మెరుగైన సమన్వయం ఏర్పడుతుందన్నారు. రక్షణ సాంకేతికలో రోజురోజుకీ పెనుమార్పులు సంభవిస్తున్నవేళ ఏదోఒక సైనిక విభాగంపై ఆధారపడటం సరికాదని, అందుకే త్రివిధ దళాలను సమన్వయపర్చేందుకు సీడీఎస్‌‌ను నియమించబోతున్నట్లు ప్రకటించారు. ఈ సీడీఎస్ దేశ భద్రత, మిలిటరీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారని అన్నారు.

కార్గిల్ యుద్ధం తర్వాత రక్షణ సంస్కరణల కోసం ఏర్పాటైన కె.సుబ్రమణ్యం కమిటీ సీడీఎస్‌ నియామకాన్ని సిఫార్సు చేసింది. ఆ తర్వాత రక్షణ దళాల వ్యవస్థలో మార్పుల కోసం నరేష్‌ చంద్ర కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ కూడా సీడీఎస్‌ వ్యవస్థ ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. అయితే, మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో సీడీఎస్ నియామకానికి సంకేతాలిచ్చినా, అప్పుడు సాధ్యంకాలేదు. ఇప్పుడు ప్రధాని మోడీ ప్రకటనతో సీడీఎస్ నియామకం కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ప్రక్రియ మొదలుపెట్టనుంది. అయితే, త్రివిధ దళాల్లోని ఏదో ఒక విభాగం నుంచి మోస్ట్ సీనియర్ అధికారిని సీడీఎస్‌‌గా ఎన్నుకునే అవకాశముందని రక్షణరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

త్రివిధ దళాలను సమన్వయపరుస్తూ, ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాన్ని రక్షణరంగ నిపుణులు గొప్ప సంస్కరణగా అభివర్ణిస్తున్నారు. దేశ భద్రత, మిలిటరీ వ్యవహారాల్లో సీడీఎస్ అత్యంత కీలకమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. 

Similar News