అయోధ్య కేసు : సుప్రీంలో హైడ్రామా

Update: 2019-10-16 07:33 GMT

అయోధ్య రామజన్మభూమి కేసులో చివరిరోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం ముందు హైడ్రామా చోటు చేసుకుంది. ఈ ఉదయం విచారణ ప్రారంభమైనప్పటి నుంచి పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఆధారంగా హిందూ మహాసభ న్యాయవాది చూపించిన పుస్తకం గందరగోళానికి దారితీసింది. ఈ పుస్తకం చించేయడంతో చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయోధ్య రీ విజిటెడ్‌ బుక్‌ను రికార్డుల్లోకి తీసుకోవాలంటూ హిందూ మహాసభ న్యాయవాది కోరాడు. దీనిపైనే వివాదం నెలకొంది. ఈ పుస్తకాన్ని అందుకున్న ముస్లీం సంస్థల తరపు న్యాయవాది ధావన్‌ దాన్ని చించేశాడు. దీంతో కోర్టులో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ముస్లీం తరపు న్యాయవాది వ్యవహారశైలిపై సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కోర్టు నుంచి వెళ్లిపోతామని హెచ్చరించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదని సమయపాలనను పాటించాలని సీజేఐ న్యాయవాదులకు వార్నింగ్‌ ఇచ్చారు. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని వాదనలను వినిపించాలని స్పష్టం చేశారు. అయితే ఓ దశలో న్యాయవాదులకు, ప్రధాన న్యాయమూర్తికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇలాంటి పరిస్థితి ఉంటే తాము వాకౌట్‌ చేస్తామని సీజేఐ స్పష్టం చేశారు. మరోవైపు అయోధ్య భూ వివాదంపై ఏర్పాటై మధ్యవర్తిత్వ కమిటీ తమ రిపోర్టును ఇవాళ సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి సమర్పించింది.

 

Tags:    

Similar News