పల్లెటూరి టీచర్‌కు అంతర్జాతీయ అవార్డు.. 7.4 కోట్ల ప్రైజ్ మనీలో సగం దానం

Update: 2020-12-05 04:34 GMT

పెద్ద ఇంజనీర్‌ కావాలని కలలు కన్నాడు. అందుకోసం క‌ష్టపడ్డాడు. కానీ, పరిస్థితులు సహకరించలేదు. అయినా ఆయన కుంగిపోలేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సహంతో ముందుకు పోయాడు. తండ్రి ఇచ్చిన సలహాతో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాడు. ఆ వృత్తే ఆయనకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. బాలికా విద్యను ప్రోత్సహించినందుకు, బాలికలను చదివించినందుకు ఒక పల్లెటూరు టీచర్ గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ అనే ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆయన్నే మహారాష్ట్రకు చెందిన రంజిత్ సింగ్ దిశాలే ఈ బాహుమతి కింద 7.37 కోట్లను గెలుచుకున్నారు.

రంజిత్ సింగ్ దిశాలే మహారాష్ట్రలోని కరువు పీడిత ప్రాంతంలో ఉన్న పరితేవాడి అనే గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. అక్కడి గిరిజన బాలికలకు విద్య ఒక్కటే కాదు, భాష కూడా సమస్యే. ఆ బాలికలకు కన్నడ మాత్రమే తెలుసు. దీంతో రంజిత్ కన్నడ నేర్చుకొని విద్యా బోధన చేశారు. దాంతో పాటు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు పాఠ్యపుస్తకాలన్నింటినీ కన్నడలో క్యూఆర్ కోడ్‌తో రీడిజైన్ చేయించారు.

రంజిత్ కృషితో 2016లో ఈ పాఠశాల జిల్లాలోనే ఉత్తమ పాఠశాల అవార్డు పొందింది. అదే ఏడాది ఇన్నొవేటివ్ రిసర్చర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో కేంద్రం ఆయనను గౌరవించింది. తనకు దక్కిన బహుమతితో సగం డబ్బును తన పది ఫైనలిస్టులతో పంచుకుంటానని దిసాలే స్పష్టం చేశారు. 12 వేలమంది టీచర్ల మీద విజయం సాధించి అవార్డు సొంతం చేసుకున్నందుకు ఆనందంగా ఉందంటూ రంజిత్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News