ఉత్తరాదిని వణికిస్తున్న చలి పంజా.. విమానాల రాకపోకలకు అంతరాయం !

Update: 2020-01-17 05:08 GMT
ఉత్తరాదిని వణికిస్తున్న చలి పంజా

ఉత్తరాదితో సహా దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో జనం చలికి వణికితున్నారు. ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల దిగువన నమోదవుతున్నాయి. పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా రన్‌వే 50 మీటర్ల నుంచి 175 మీటర్ల పరిధిలోపే కనిపిస్తోందని ఢిల్లీ విమానాశ్రయవర్గాలు తెలిపాయి. దీంతో పలు విమానాలను మళ్లించారు. అటు ఉత్తర రైల్వే పరిధిలో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి రావాల్సిన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇక, దేశ రాజధాని ఢిల్లీ చలికి గజగజ వణికిపోతోంది. చలికి తోడు చినుకులు పడటంతో హస్తినవాసులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గురువారం నాడు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 2.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఢిల్లీలో దట్టంగా అలముకున్న పొగమంచుతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ నమోదైంది.

జమ్మూ-కశ్మీర్‌, లడఖ్‌లు అత్యంత శీతల వాతావరణంతో వణికిపోతున్నాయి. లేహ్‌, ద్రాస్‌ సెక్టార్‌లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 19.1, మైనస్‌ 28.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ల్లోని పలుప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కుఫ్రీ, మనాలీ మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. యూపీలో మీరట్‌లో అత్యల్పంగా1.7 డిగ్రీలు, రాజస్థాన్‌లోని సికార్‌లో మైనస్ 1.5 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒడిశాలోనూ ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో జనం చలికి వణుకుతున్నారు.

Tags:    

Similar News