7 లేదా 8 దశల్లో సాధారణ ఎన్నికల పోలింగ్‌!

Update: 2019-03-08 02:32 GMT

17వ లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల సామాగ్రిని దాదాపు సిద్ధం చేసింది. దీంతో ఏక్షణమైనా షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సాధారణ ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అధికార పక్షాలు త్వరితగతిన శంకుస్థాపనలు, కీలక ఫైళ్లమీద సంతకాలు చేసేస్తున్నారు. ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్‌ 3వ తేదీతో ముగియనుంది. దీనిపై చర్చించేందుకు వచ్చే వారం ఎన్నికల పరిశీలకులు సమావేశం కానున్నారు. 7 లేదా 8 దశల్లో జరగనున్న ఈ ఎన్నికలకు రెండు మూడు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి ఆఖరిలోగా విడుదలవనుండగా, పోలింగ్‌ ఏప్రిల్‌ ప్రథమార్ధంలో జరిగే అవకాశముంది. కాగా మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 10 లక్షల పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. ఇదిలావుంటే 2014 సాధారణ ఎన్నికలకు మార్చి 5వ తేదీన ఎన్నికల ప్రకటన వెలువడితే.. ఈసారి మార్చి 8వ తేదీ వచ్చినా.. ఇంకా ఎన్నికల ప్రకటన రాకపోవడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ ఆలస్యం చేయడం లేదని, నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రకటన జారీకి ఇంకా సమయం ఉందని మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్‌ చెప్పారు. 

Similar News