లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఉబర్ క్యాబ్ సర్వీసులను నిలిపివేత

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి గాను 22వ తేది ఆదివారం జనతా కర్ఫ్యూని విధించిన విషయం తెలిసిందే.

Update: 2020-03-23 05:29 GMT
Uber Cab Service

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి గాను 22వ తేది ఆదివారం జనతా కర్ఫ్యూని విధించిన విషయం తెలిసిందే. కాగా కరోనాని మరింత కట్టడి చేయడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఇందులో భాగంగానే దూర ప్రయాణాలు చేయాలనుకున్న ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే క్యాబ్ సర్వీలు నడుస్తాయా లేదా అన్న అనుమానాలు ప్రజల్లో కలిగాయి. దీంతో వారంతా ఉబర్ సంస్థకు ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. వీరి ప్రశ్నలకు స్పందించిన ఉబర్ సంస్థ యాజమాన్యం సోమవారం నుంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నగరంలో ఉబర్ రైడ్ సేవలను నిలిపేస్తున్నట్లు సమాధాపం ఇచ్చారు.

ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదే విధంగా కరోనాను నివారించేందుకు ఉబర్ సంస్ధ కూడా ఇదే దారిలో నడుస్తుందని తెలిపింది. ఇక ప్రయివేటు క్యాబ్ సంస్దలలో ఉన్న ఓలా మాత్రం తన సర్వీసులను రద్దు చేసుకోకుండా యథాతధంగా నడుస్తున్నట్లు తెలిపింది. ఓలా సంస్థ క్యాబ్ సర్వీసులను రద్దు చేసినప్పటికీ ఎవరైనా బుకింగ్ చేసుకున్నట్టయితే ఆ ప్రాంతంలో క్యాబ్ లు అందుబాటులో ఉంటే బుక్ చేయడం సాధ్యపడుతుందని తెలిపారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు చూపించిన పట్టుదల ఈ నెల 31వ తేదీ వరకూ చూపించాలని ఆయన అన్నారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇంటి అవసరాల కోసం కావాల్సిన పాలు, కూరగాయలు కోసం మాత్రమే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు నెలరోజులకు సరిపడా రేషన్‌ బియ్యం ఇస్తాం. తెల్లరేషన్‌ కార్డులు ఉన్నవారికి ఒక్కరికి ఉచితంగా 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని తెలిపారు కేసీఆర్.

లాక్‌డౌన్ కాలంలో బియ్యంతో పాటు ప్రతి రేషన్‌కార్డుదారుకు రూ.1,500 ఇస్తామని వెల్లడించారు. అందుకోసం రూ.1314 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఆయా సంస్థలు వారం రోజుల వేతనాన్ని చెల్లించాలని సూచించారు. ప్రజారవాణా కూడా అందుబాటులో ఉండదని.. బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు ఏవీ నడవబోవని ప్రకటించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తామని కేసీఆర్ వెల్లడించారు. రోడ్లుపై ఐదుగురికి మించి ఎవరూ గుమికూడవద్దని.. సరుకుల కోసం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News