మర్కజ్ ఘటనతో మూల్యం చెల్లించుకున్నాం: ఢిల్లీ సీఎం

దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు..

Update: 2020-04-19 17:20 GMT
Arvind Kejriwal (File Photo)

దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు.. ఇప్పటికే దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం సాయంత్రం 5 గంటలకు) కొత్తగా 1,334 పాజిటివ్‌ కేసులు, 27 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు దేశంలో 519 మంది మృత్యువతపడ్డారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,116కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఈ వైరస్‌ బారి నుంచి 2301 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపింది.

ఇక క‌రోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి. ఇప్పటివరకు ఢిల్లీలో 1830కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 43 మంది మరణించారు. అయితే తాజాగా కరోనా వైరస్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మ‌ర్కజ్‌ ఘటన కారణంగా తాము మూల్యం చెల్లించుకున్నామ‌ని, అయినప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు.

శనివారం ఢిల్లీలో కొత్తగా 736 పరీక్షలు నిర్వహించగా, 186 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఇక ఢిల్లీలో ప్రస్తుతానికి లాక్‌డౌన్ స‌డ‌లింపులు లేవని, వచ్చేవారం తరవాత లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌పై ఆలోచిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.




Tags:    

Similar News