వచ్చే వారం మధ్యప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ..! రంగంలోకి దిగిన సింధియా..

వచ్చే వారం మధ్యప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది.

Update: 2020-04-18 02:07 GMT

వచ్చే వారం మధ్యప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే పలు దఫాలుగా బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపిన సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. క్యాబినెట్ కూర్పునకు కసరత్తు ప్రారంభించారు. మార్చి 23 న రాజ్‌భవన్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా సంక్షోభం దృష్ట్యా ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సంక్షోభ సమయంలో ఆరోగ్య, ఆర్ధిక హోమ్ శాఖ వంటి కీలకమైన శాఖలు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం కరోనా కట్టడిపై ఒక్కరిగానే పోరాటం చేస్తున్న శివరాజ్ సింగ్ చౌహన్.. సహాయంగా ఉండేందుకు క్యాబినెట్ పదవులు విస్తరించాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా మొదటి విడతలో కీలకమైన శాఖలను సీనియర్లకు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కేబినెట్ ఏప్రిల్ 20 లేదా 21 న ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ విధానసభలో (గరిష్టంగా 15 శాతం) సభ్యుల సంఖ్య ప్రకారం, మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 35 మంది సభ్యులు ఉండవచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఆయన 34 మందిని మంత్రులుగా చేయవచ్చు. కానీ సాధారణంగా, ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా కేబినెట్‌లో కొన్ని పదవులను ఖాళీగా ఉంచుతారు.

అయితే, ఇప్పుడు 9-10 మంది మంత్రులు మాత్రమే తొలివిడతలో ప్రమాణ స్వీకారం చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే ఇటీవల బీజేపీలో చేరిన జోతిరాధిత్య సింధియా తన అనుచర ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీనిపై చర్చించేందుకు సింధియా గురువారం ఢిల్లీ లో హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు.


Tags:    

Similar News