భారత్ లో 30% కేసులకు మర్కజ్ లింక్
దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో మర్కజ్ ఘటనతో సంబంధమున్నవే 4 వేల పైచిలుకు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో మర్కజ్ ఘటనతో సంబంధమున్నవే 4 వేల పైచిలుకు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మర్కజ్ ఘటనతో లింక్ ఉన్న కేసులు మొత్తం 29.8 శాతం ఉన్నాయని పేర్కొంది. జమాత్ సభ్యులు దేశంలోని 23 రాష్ట్రాల్లో కరోనా సంక్రమణను వ్యాప్తి చేశారు. ఇందులో తమిళనాడులో 84%, ఢిల్లీలో 63%, తెలంగాణలో 79%, ఆంధ్రప్రదేశ్‌లో 61% , ఉత్తర ప్రదేశ్‌లో 59% మంది తబ్లిఘి జమాత్‌కు చెందినవారు ఉన్నారు. గడిచిన 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాలు దేశం మొత్తం మీద 47 ఉన్నాయి. అంతేకాదు పుదుచ్చేరిలోని మహే, కర్ణాటకలోని కొడగు జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్త కేసులు ఏవీ కనుగొనబడలేదు.
కరోనాతో మరణించిన వారి సంఖ్య శనివారానికి 500 దాటింది. అలాగే పాజిటివ్ కేసులు కూడా 15 వేలకు చేరుకున్నాయి. దేశం మొత్తమ్మీద యాక్టివ్ కేసులు 11,906 కాగా 2015 మంది ఇప్పటి వరకు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో 43 మంది మరణించారని ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 12 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 7, ఢిల్లీలో 4, గుజరాత్‌లో 3, జమ్మూకశ్మీర్, బిహార్‌లలో ఒక్కో మరణం నమోదయింది.